దిశ దశ, జాతీయం:
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా తయారైంది పాకిస్తాన్ సోషల్ మీడియా సైన్యం తీరు. ఓ వైపున భారత సైన్యం చేతుల్లో చావు దెబ్బలు తింటున్నా పాకిస్తాన్ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. సరిహద్దుల్లో యుద్దం చేయడం చేతకాని దద్దమ్మలు చేస్తున్న తప్పుడు ప్రచారం శృతి మించి పోతోంది. భారత దేశంలో అల్లకల్లోలం సృష్టించామని చెప్పుకుంటూ ప్రపంచాన్ని కూడా తప్పుదారి పట్టించే పనిలో నిమగ్నం అయ్యారు. భారత సైన్యం వదులుతున్న అస్త్రాలతో పాకిస్తాన్ ప్రజలు అతలాకుతలం అవుతుంటే తాము అంతకన్నా ఎక్కువ భారత్ కు నష్టం చేకూర్చామని చెప్పుకుని గొప్పలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా అయితే షరీఫ్ గాళ్లు చేస్తున్న తుగ్లక్ ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే…?
పాట్నాలో పోర్ట్..!
బీహార్ రాజధాని పాట్న నగరంలో సముద్రం ఉందట… అక్కడ ఉన్న సీ పోర్టును పేల్చేశారట పాకిస్తాన్ సైన్యం. గంగా నది ఒడ్డున ఉన్న పాట్నా నగరానికి ఏకంగా సముద్రాన్ని తరలించి అక్కడ నౌకాశ్రయాన్ని వాళ్లే ఏర్పాటు చేసి పేల్చేశారో లేక పాకిస్తాన్ లో పాట్నా సిటీ ఉందని చెప్తున్నారో అర్థం కావడం లేదు. కానీ పాకిస్తాన్ కు చెందిన ట్విట్టేశ్వరులు షరీఫ్ గా ఆలోచించకుండా Mischief గా చేస్తున్న దుష్ప్రచారం చూస్తే విస్తుపోవల్సిందే. సోషల్ మీడియాలో వేదికగా వేలాది అకౌంట్లను క్రియేట్ చేసుకున్న పాకిస్తాన్ ‘డాన్స్’ భారత్ తో సరికొత్త యుద్దానికి తెరలేపారు. పాకిస్తాన్ లో భారత్ ఎత్తులతో జరుగుతున్న నష్ట నివారణ చర్యలకు పూనుకోకుండా ఫేక్ క్యాంపెయిన్ తో సంబురపడి పోతున్నారు. నది తీరాల్లో ఎలాంటి రవాణా సౌకర్యం ఏముంటాయి..? సముద్ర తీరాల్లో ఎలాంటి రవాణా సౌకర్యం ఉంటుందోనన్న విషయం కూడా తెలియని అజ్ఞానులు చేస్తున్న ఇలాంటి ప్రచారాన్ని చూసి భారతీయులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అస్త్ర సన్యాసం చేశారా..?
పాకిస్తాన్ వారియర్స్ సోషల్ మీడియా కేంద్రంగా షేర్ చేస్తున్న ఫేక్ పోస్టులను గమనిస్తుంటే అస్త్ర సన్యాసం చేసినట్టుగానే కనిపిస్తోంది. భారత త్రివిధ దళాలు చేపడుతున్న ఆపరేషన్లతో ఉక్కిరిబిక్కిరయిపోయి ఊకదంపుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది. దేశంలోని పలు విమానాశ్రయాలను కూడా పేల్చేశామంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా పోస్టులు పెడితే భారత సమాజమంతా కూడా సెటెరికల్ కామెంట్స్ చేస్తోంది. పాకిస్తాన్ సగటు పౌరులను మభ్య పెడుతూ భ్రమల ప్రపంచంలో విహరిస్తున్న సోషల్ మీడియా సైన్యం మానసిక స్థితి అంతా భ్రమల్లోకి చేరుకోవడంతో అప్పటికప్పుడు కట్టు కథలు అల్లుతూ ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియా పులులు చేస్తున్న ప్రచారం అంతా వట్టిదేనని, దేశంలో భయానక పరిస్థితులు తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.