మల్టిపర్పస్ సొసైట్ మాటున గేమింగ్ దందా…
కెనెస్ట్రా… ఫోర్ ప్యాక్స్… 101 కౌంట్…
దిశ దశ, జాతీయం:
మహారాష్ట్ర సరిహధ్దులే అడ్డాలుగా విచ్చలవిడిగ జూదం కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలోని ప్లేయర్స్ ను ఎరవేసేందుకు నిర్వాహాకులు అక్కడి చట్టాలను ఆలంబనగా చేసుకుని పేకాట కేంద్రాలను దర్జాగా నిర్వహిస్తున్నారు. అనుమతికి మించి టేబుళ్లలో గేమింగ్ నిర్వహిస్తున్న నిర్వహాకులు ఇస్తున్న నజరానాలు గమనిస్తే అక్కడ ఏ స్థాయిలో నగదు లావాదేవీలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చంద్రపూర్ జిల్లా రాజూరా తాలుకా దాబా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోడ్సా వద్ద నడుస్తున్న జూదం కేంద్రంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కెనెస్ట్రా…
101 కౌంట్ తో కెనాస్ట్రా రమ్మి అడిస్తున్నారు నిర్వాహాకులు. నాలుగు సార్లు ప్యాక్ చేసినా ఐదో సారి గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకే టేబుల్ పై 9 మందికి అవకాశం కల్పిస్తూ టేబుల్ పై నడిచే తీరును బట్టి ‘‘కేటు’’ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ రూ. 5 వేల నుండి రూ. 30 వేల వరకు ప్రత్యేకంగా టేబుళ్లే ఏర్పాటు చేసి గేమింగ్ నడిపిస్తున్నారు. రూ. 20 వేల చొప్పున 9 మంది ప్లేయర్స్ చెల్లిస్తే అందులో ఒకరు చెల్లించే మొత్తం అంటే రూ. 20 వేలు కేటు కట్ చేస్తున్నారు నిర్వాహాకులు. ఈ డబ్బుతో భోజనం, స్నాక్స్, డ్రింకింగ్ వాటర్, హాట్ డ్రింక్స్ ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తున్న నిర్వహాకులు ప్లేయర్స్ ను పోడ్సా క్లబ్ వరకు తరలించే వారికి ఇస్తున్న నజరానాలు కూడా ఫంటర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలా ప్లేయర్స్ ను తరలించేందుకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఏజెంట్లు తయారయినట్టుగా తెలుస్తోంది.
టైమింగ్ ప్రకారం…
ఈ జూదం కేంద్రానికి ప్రేయర్స్ ను తరలించేందుకు విధిగా టైమింగ్ కూడా మెయింటెన్ చేస్తున్నారు. మద్యాహ్నం 2 గంటల లోపున ప్లేయర్స్ ను తరలించిన వారికి అయితే ఒక్కొక్కరికి రూ. 4 వేలు, సాయంత్రం 4 గంటల లోపు వరకు ప్లేయర్స్ ను తరలించిన వారికి అయితే ఒక్కొక్కరికి రూ. 3,500 చొప్పున కమిషన్ చెల్లించే విధానం కొనసాగుతున్నట్టుగా బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన పోడ్సా క్లబులో ఏ స్థాయిలో పేకాట సాగుతోంది… అక్కడ ఎంత మేర ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్లేయర్ కేవలం ఒక ఆట ఆడి తప్పుకున్నట్టయితే మాత్రం కమిషన్ ఇవ్వమని, కనీసం నాలుగైదు గేమ్స్ ఆడాల్సి ఉండుందన్న కండిషన్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. నిర్వాహాకుల సకల సౌకర్యాలు, ఫంటర్లకు కమిషన్లు ఇస్తున్నారంటే ఎంత పెద్దమొత్తంలో నగదు వారి చేతుల్లోకి వచ్చి చేరుతోందో గమనించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ క్లబ్ నిర్వహాణ కోసం 10 టేబుళ్లను మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ అదనపు టేబుళ్లను కొనసాగిస్తూ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వందల్లో కార్లు…
సిర్పుర్ కు పట్టు మని పది కిలోమీటర్ల దూరంలో వంతెనకు సమీపంలో ఏర్పాటు చేసిన పోడ్సా క్లబ్ కు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్లేయర్స్ వెలుతున్నారు. నిత్యం వందలాది కార్లు అక్కడకు చేరుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ జూదం కేంద్రానికి చేరుకునే వాహనాల కోసం ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారంటే జూదం ప్రియులు ఎలా క్యూ కడుతున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు.
కట్టడి చేస్తే…
తెలంగాణ పరిధిలో కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్న జూదం కేంద్రం కావడంతో పేకాట రాయుళ్లను పట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలా సరిహద్దుల్లో గేమింగ్ నడుస్తున్నదని, నిత్యం వందలాది మంది తెలంగాణ జూదగాళ్లు మహారాష్ట్ర వైపు వెలుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న సరిహధ్దు ప్రాంతాల పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. సరిహధ్దుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కట్టడి చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు కూడా ఇదే పద్దతిన జూదగాళ్లు వెలుతున్న రహదారులను దిగ్భందనం చేసినట్తయితే వారి వద్ద దొరికే నగదుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు చొరవ తీసుకుంటే జూదగాళ్లను నియంత్రించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోడ్సా క్లబ్ కేంద్రంగా సాగుతున్న ఈ దందా వళ్ల బ్లాక్ మనీ వినియోగాన్ని మరింత పెంచిపోషించినట్టు అవుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

