Telangana to Maharashtra: తెలంగాణా TO మహారాష్ట్ర….

గోండ్ పిప్పిరి తాలుకాలో గోల్ మాల్…

దిశ దశ, జాతీయం:

తెలంగాణ సరిహద్దు రహదారులన్నీ కార్ల రాకపోకలతో కిక్కిరిసిపోతున్నాయి. వేకువ జామున కళకళలాడుతూ వెల్తున్న కార్లు… సాయంత్రం నుండి నిరుత్సాహంతో వెనుదిరిగి వస్తున్నాయి. రహదారి సౌకర్యం కూడా మెరుగు కావడంతో ఈ వాహనాల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతున్నది. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా వాహనాలు వెల్లడానికి కారణం ఏంటీ..? ఇంతగా జనం అటువైపు పరుగులు తీస్తున్నారోనన్న విషయం తెలిస్తే ఆశ్యర్య పోవడం అందరి వంతు అవుతుంది.

చంద్రపూర్ జిల్లా…

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గొండ్ పిప్పిరి తాలూకా పోడ్సాలో జూదం కేంద్రం నిర్వహిస్తున్నారు. తెలంగాణాలో క్లబ్బులకు అనుమతి ఉన్న పేకాట ఆడేందుకు అనుమతి లేకపోవడం… మహారాష్ట్రలో క్లబ్బుల పేరిట అనుమతులు తీసుకుని రమ్మీ, తీన్ పత్తా ఆడించినా పట్టించుకునే వారు లేకపోవడంతో అక్కడ 24 గంటలూ గేమింగ్ నడుస్తూనే ఉంటోంది. క్లబ్ పేరిట రిజిస్టేషన్ చేసుకుని నిర్వహాకులు నిర్విరామంగా జూదం ఆట కొనసాగిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోడ్సాలో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ లో వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఎకరాల్లోనే స్థలాన్ని కెటాయించారంటే ఇక్కడకు ఏ స్థాయిలో జూదం ఆడేందుకు చేరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా క్లబ్ అంటే అన్ని రకాల గేమ్స్ తో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి వెల్లే పరిస్థితులు ఉండాలి. కానీ పోడ్సా క్లబ్బు మాత్రం కేవలం జూదం ఆడేందుకు మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుండడం గమనార్హం.

టీజీ నుండే…

పోడ్సాలో నడుస్తున్న క్లబ్ కు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వారు వందల సంఖ్యలో వెలుతున్నట్టుగా తెలుస్తోంది. వేకువ జాము నుండి పోడ్సా క్లబ్ లో జూదం ఆడేందుకు వెలుతున్న వారు డబ్బులు పోగొట్టుకుని అప్పుల్లో కూరుకపోతున్నట్టుగా తెలుస్తోంది. వందలాది కార్లలో పోడ్సా క్లబ్బుకు సరిహద్దు జిల్లాలకు చెందిన వారు వెల్లి అక్కడ పేకాట ఆడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అంతా తెలుగే…

పోడ్సా క్లబ్బులో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది తెలుగు వారే కనిపిస్తుండడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన వారిపై క్లబ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి భాగస్వామ్యంతోనే జూదం కేంద్రం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర నివాసితులు అయితేనే క్లబ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చే నిబంధనలు ఉండడంతో అక్కడి వారిని మచ్చిక చేసుకున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు పోడ్సాలో క్లబ్ నిర్వహిస్తున్నట్టుగా ఓపెన్ టాక్.

డ్రైవర్లు… కార్లు…

తెలంగాణ ప్రాంతం నుండి కార్లలో జూదగాళ్లను తరలించేందుకు పోడ్సా క్లబ్ నిర్వహాకులు స్పెషల్ ఆఫర్లను కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతం నుండి పేకాటరాయుళ్లను తరలించే కార్ల యజమానులకు డబ్బులు కూడా ముట్ట జెప్తున్నట్టుగా సమాచారం. ఒక్కో అభ్యర్థికి రూ. 2000 నుండి 2,500 వరకు క్లబ్ నిర్వాహాకులు చెల్లిస్తుంటారని, క్లబ్ లో డ్రైవర్లకు వెజ్, నాన్ వెజ్ భోజనం, లిక్కర్ ఉచితంగా అందించడంతో పాటు రెస్ట్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొంతమంది కార్ల డ్రైవర్లే తెలంగాణ ప్రాంతం నుండి పేకాట రాయుళ్లను ఉచితంగా తీసుకవెలుతున్నట్టుగా సమాచారం. ట్రావెలింగ్ చార్జీలు లేకుండానే పోడ్సా క్లబ్ కు చేరుకునేందుకు రవాణా సౌకర్యం సమకూరుతుండడంతో ఔత్సాహికులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వెల్తున్నట్టుగా తెలుస్తోంది.