MAOIST NEWS: సీఓ నుండి సీసీ కమిటీ మెంబర్ వరకు…

విద్యార్థి విభాగం నిర్మాణం…

తపంచాతో మొదలై ఏకె 47 వినియోగం దాక…

మలోజ్జుల వేణుగోపాల్ ప్రస్తానం…

దిశ దశ, పెద్దపల్లి:

నడుముకు తపంచా… సైకిల్ పై ప్రయాణం… విద్యార్థుల గదుల్లో సిద్దాంతాల బోధన… నిజాం విముక్తి పోరాటంలో తండ్రి కీలక పాత్ర వహిస్తే తనయుడు మాత్రం సమసమాజ స్థాపన కోసం సాయుధ మార్గం ఎంచుకున్నాడు. దున్నే వాడిదే భూమి, అణగారిణ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరుబాట పట్టిన విప్లవోద్యమ నేత అనూహ్య పరిణామాల్లో జనజీవనంలోకి వచ్చేందుకు సమాయత్తం అయ్యారు. మంగళవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ అయిన మలోజ్జుల వేణుగోపాల్, మరో కేంద్ర కమిటీ సభ్యునితో పాటు 60 మంది సాయుధ నక్సల్స్ మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. బుధవారం మలోజ్జుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ భూపాతి, సోనూదాదాల సరెండర్ ను అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో మావోయిస్టుల లొంగుబాటు జరగనున్నట్టుగా తెలుస్తోంది.

విద్యార్థి సంఘం…

పీపుల్స్ వార్ ఆవిర్భావానికి ముందు ఏర్పడిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) ఆర్గనైజర్ గా వామపక్ష విప్లవోద్యమాల్లోకి అడుగుపెట్టిన మలోజ్జుల వేణుగోపాల్ ను మొదట్లో MV అని పిలిచేవారు. పెద్దపల్లి ప్రాంతంలో బలంగా పార్టీ ఏర్పాటవుతున్న నేపథ్యంలో సీఓల నియామకం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అగ్రనాయకత్వం. అప్పుడు సుల్తానాబాద్ సమితి సీఓగా ఎంవీ, పెద్దపల్లి సమితికి దేవేందర్ రెడ్డి, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం ప్రాంతానికి దగ్గు రాజలింగులు వ్యవహరించారు. ఆ తరువాత మహదేవపూర్, ఏటూరునాగారం ఏరియాలో పోరెడ్డి వెంకన్న దళంలో సభ్యునిగా అడవి బాట పట్టిన ఆయన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలో పార్టీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే జిల్లాలోని అహేరీ తాలుకాకు చెందిన తారక్కను వివాహం చేసుకున్నారు అభయ్. దండకారణ్య అటవీ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన నాయకుల్లో ఒకరైన అభయ్ తనదైన ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పని చేస్తున్నారు. విప్లవంవైపు అడుగులు వేసిన తొలినాళ్లలో భూపతి స్వీయ రక్షణ కోసం తపంచాను వినియోగిస్తే ప్రస్తుతం ఏకె 47 ఆయుధాన్ని వాడుతున్నారు. 69 ఏళ్ల అభయ్ పీపుల్స్ వార్ లో సెకండ్ జనరేషన్ లీడర్ గా కొనసాగగా ఆయన అన్న మలోజ్జుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు.

ముగ్గురు లొంగుబాట…

అయితే నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంతో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర పెద్దపల్లి పట్టణంలోని మలోజ్జుల కుటుంబానికి ఉంది. ఆయన అన్న కిషన్ జీ ఎన్ కౌంటర్ లో చనిపోగా వేణుగోపాల్ రావు మాత్రం ఆయుధాలను త్యజించాలని నిర్ణయించుకున్నారు. 14 ఏళ్లు క్రితం అన్నను కోల్పోయినప్పటికీ విప్లవ పంథాలోనే ముందుకు సాగారు అభయ్. ఆయన భార్య తారక్క ఈ ఏడాది జనవరి 1న గడ్చిరోలి జిల్లా కేంద్రంలో నిర్వమించిన లొంగుబాట కార్యక్రమంలో జనజీవనంలో కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో ఆమె లొంగిపోయారు. ఆయన సొదరుడు కిషన్ జీ భార్య పోతుల కల్పన ఇటీవలే తెలంగాణ డీజీపీ సమక్షంలో సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో స్థానం దక్కించుకున్న కల్పన అనారోగ్యంతో జనజీవనంలో కలిశారు.

అనూహ్య పరిణామాలు…

కేంద్ర ప్రభుత్వం ఆఫరేషన్ కగార్ పేరిట భారీగా బలగాలను మోహరించడంతో మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న దండకారణ్య అడవులు జల్లెడ పడుతున్నట్టుగా మారిపోయింది. కీకారణ్యాల్లో గత ఏడాదిన్నర కాలంగా మావోయిస్టు పార్టీ ఏరివేతే లక్షంగా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గతంలో నక్సల్స్ ఏరివేతలో అడపాదడపా కేంద్ర కమిటీ నాయకత్వం పోలీసుల కాల్పుల్లో చనిపోయినప్పటికీ ఎక్కువ శాతం మంది కింది స్థాయి వారే మరణించారు. అయితే ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టుల కార్యకలపాలు ఎక్కడికక్కడ స్తంభించే పరిస్థితులను కల్పించారు. దీంతో పాటు కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యంగా బలగాలు కూంబింగ్ చేపట్టి సైద్దాంతిక మూలాలను అంతమొందించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ కూడా పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. విప్లవ పోరాటంలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కోల్పోయిన ఘటనలు అత్యంత అరుదుగా చోటు చేసుకున్నాయి. చారమజుందార్ తరువాత ఎన్ కౌంటర్ లో చనిపోయింది బసవరాజ్ కావడం గమనార్హం. ఐదు దశాబ్దాల విప్లవ పోరాటంలో అసువులు బాసిన విప్లవోద్యమ కారులు ఎంతో మంది ఉన్నా పార్టీకి మూల స్తంభం అయిన కార్యదర్శిని కోల్పోవడం మావోయిస్టు పార్టీ ఉనికికే సవాల్ విసిరిందని చెప్పక తప్పదు. దేశంలోనే అత్యంత దట్టమైన అడువులుగా పేరుగాంచిన చత్తీస్ గడ్ దండకారణ్యంలో బలగాలు మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలే లక్ష్యంగా ఏరివేత కొనసాగిస్తున్న తీరు అటు పార్టీలోనూ ఇటు విప్లవ అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తం అయింది. కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ ఎన్ కౌంటర్ కు ముందు జరిగిన చర్చల్లో ఆయుధాలను వదిలేజి జనంతో మమేకం కావడం మంచిందని, సమాజంలో ఉంటూ సైద్దాంతిక నిర్మాణం చేపట్టడం వల్ల సానుకూల ఫలితాలను రాబట్టవచ్చన్న అంశంపై తర్జనభర్జనలు సాగాయి. ఇందుకు సానుకూలతను వ్యక్తం చేస్తూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అభయ్ పేరిట ఆగస్టు నెలలో తయారు చేసిన ప్రకటన సెప్టెంబర్ 17న బాహ్యప్రపంచంలోకి వచ్చింది. అయితే బలగాల సెర్చింగ్ ఆపరేషన్ల వల్ల పార్టీ నాయకత్వం కలుసుకునే పరిస్థితులు లేకపోవడం వల్లే అభయ్ ఈ ప్రకటన చేసి ఉంటారన్న వాదనలు వినిపించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు అలియాస్ జగన్ పేరిట విడుదలైన లేఖ అభయ్ ప్రకటనను తప్పు పట్టింది. అంతర్గతంగా జరుపుకోవల్సిన విషయాలను రచ్చకెక్కించడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ తరువాత అభయ్ కూడా విప్లవోద్యమంలో ఒడిదొడుకులు పోరాటంలో ఇప్పటి వరకు చేసిన తప్పిదాలపై 22 పేజీల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే అభయ్ పార్టీకి ద్రోహిగా మారిపోయాడని అతని వద్ద ఉన్న ఆయుధాలను, డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకోవాలని మరో ప్రకటన విడుదల అయింది. ఇదు సమయంలో బస్తర్ నార్త్ డివిజన్ కమిటీ, గడ్చిరోలి డివిజన్ కమిటీలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనలో అభయ్ అలియాస్ సోనూదాదా నిర్ణయాన్ని స్వాగతించాయి. తాము ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని స్పష్టం చేశాయి. అంతేకాకుండా సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ పేరిట విడుదలైన ఓ లేఖలో కూడా అభయ్ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నామని వెల్లడించారు. అయితే అశోక్ పేరిట రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన మరో లేఖలో మాత్రం ఆయన వ్యవహారశైలిని తప్పు పట్టడంతో పాటు సాయుధ పోరాటం చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ లేఖ విడుదలైన 24 గంటల్లోనే అభయ్ సహా 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయినట్టుగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం.