దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందు అవసరమైన బలం లేక పోవడంతో మెజార్టీ స్థానాలు సాధించిన బీజేపీ, అధికారం చేజిక్కుంచుకోవాలన్న తపనతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రులు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు తీవ్రంగా జరిపాయి. ఈ సారి ఏకంగా 8 మంది స్వతంత్రులు, ఇద్దరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన వారు గెలిచారు. శుక్రవారం ఫలితాల ప్రకటన వెలువడిన నేపథ్యంలో స్వతంత్రులను తమ పార్టీలో చేర్పించుకునేందుకు బీజేపీ పావులు కదిపింది. శుక్రవారం రాత్రి ఇద్దరిని బీజేపీలో చేర్పించుకోగా అందులో ఒకరు AIFB పార్టీకి చెందిన 15వ డివిజన్ కార్పొరేటర్ విపుల సాయి జ్యోతి ఉన్నారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు పార్టీ నేతల టచ్ లోకి రాగానే బీజేపీ నాయకులు క్యాంపు ఏర్పాటు చేశారు. శనివారం మరో ఇద్దరు స్వతంత్రులను చేర్పించుకోవడంతో తాము సేఫ్ జోన్ లో ఉన్నామని బీజేపీ నాయకులు అనుకున్నారు. అయితే ఓ వైపున శనివారం ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ కూడా కార్యరంగంలోకి దిగింది. బీజేపీ క్యాంపులో చేరని స్వతంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, AIFB పార్టీల సభ్యులను తీసుకెళ్లి మరో క్యాంపు ఏర్పాటు చేసింది. అయితే బీజేపీ క్యాంపులోకి 15 డివిజన్ కార్పొరేట్ వెళ్లలేదని ఆమె భర్త వెళ్లాడన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను తమకు మద్దతు ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. శనివారం మద్యాహ్నం వరకు విపుల సాయి జ్యోతి నుండి సానుకూల వాతావరణం ఏర్పడగానే ఆమెను హుటాహుటిన హైదరాబాద్ శివార్లలోని కాంగ్రెస్ క్యాంపునకు తీసుకెళ్లారు. అనంతరం విపుల సాయి జ్యోతి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రకటన వెలువడింది. సోమవారం ఉదయం వరకు కాంగ్రెస్ కూటమిలో సమీకరణాలు అన్ని కూడా విఫలం కావడంతో క్యాంపు విచ్చిన్నం అయిపోయింది. దీంతో సోమవారం నాటి ప్రమాణ స్వీకారానికి AIFB కార్పొరేటర్ గా జ్యోతి హాజరు కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల కూడా సోమవారం AIFB పార్టీ కార్పొరేటర్ గా సమావేశానికి అటెండ్ అయ్యారు. ఏది ఏమైనా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో వెంట వెంటనే పార్టీలను మార్చే పరిస్థితి ఎదురు కావడం చర్చనీయాంశంగా మారింది.

