పూర్వాశ్రమానికి చేరిన మహిళానేత…

దిశ దశ, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా పరిషత్ తాజా మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ దంపతులు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. వీరితో పాటు మరో వంద మంది కాషాయం కండువా కప్పుకున్నారు. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

సొంత గూటికే…

చాలాకాలం పాటు బీజేపీలోనే కొనసాగిన కనుమల్ల విజయ, గణపతి దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ తిరిగి బీజేపీలో చేరడం గమనార్హం. ఈటల రాజేందర్ ఆద్వర్యంలో గతంలో గులాభి కండువా కప్పుకున్న విజయ ఉప ఎన్నికల సమయంలో కూడా ఉద్యమ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, విజయకు మధ్య విబేధాలు పొడసూపినా పార్టీని మాత్రం వీడలేదు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో చెప్పుకుని వేదనకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆమె మాత్రం ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా తిరిగి సొంత గూటికి చేరాలని నిశ్చయించుకున్నారు. గతంలో జమ్మికుంట నగర పంచాయితీలో కూడా వార్డు కౌన్సిలర్ గా ప్రాతినిథ్యం వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో చర్చలు జరిపిన విజయ, గణపతి దంపతులు గురువారం తన సహచరులతో కలిసి బీజేపీలో చేరారు.

చేతల్లో చూపిస్తా: బండి సంజయ్…

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆదరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది ఏంటో చేతల్లోనే చూపిస్తానని ప్రకటించారు. లోకసభ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తో పాటు అన్ని మునిసిపాలిటీల్లో ఇప్పటికీ జరిగిన అభివృద్దికి నిధులు విడుదల చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ 1, 2, స్వచ్ఛ భారత్ తదితర పథకాలతో పాటు ఆర్ధిక సంఘం విడుదల చేసిన నిధులతోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోయాయన్నారు. రానున్న ఎన్నికల్లో ‘‘అభివ్రుద్దే మా విధానం… హిందుత్వమే మా నినాదం’’ పేరుతో ప్రజల్లోకి వెల్తామని బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాంగ్రెస్ పార్టీ పట్టణాల అభివృద్ది కోసం నిధులు కెటాయించలేదని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ కూడా నిధులు మంజూరు చేయించడమనేది అసాధ్యమైన విషయమన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించినట్టయితే అన్ని రకాల అభివృద్ది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ డి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, జమ్మికుంట బీజేపీ నాయకులు ఆకుల రాజేందర్, పుప్పాల రఘులు పాల్గొన్నారు.