కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసుల ప్రమేయం…
దిశ దశ, కరీంనగర్:
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల వ్యవహారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న సీబీఐ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్న ఈ కేసులో కరీంనగర్ వాసులు కూడా ఉండడం సంచలనంగా మారింది. సీబీఐ విడుదల చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుల వివరాలను వెల్లడించడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న సీబీఐ ఢిల్లీ అధికారులు విడుదల చేసిన ఎఫ్ఐఆర్ లో పొందుపర్చిన వివరాలను బట్టి గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారు కాగా ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
సీబీఐ ట్రాప్…
ఈ నెల 9న ముంబాయిలో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అసిస్టెంట్ జనరల్ మేనజర్లు (AGM) మైనపల్లి శ్రీనివాస రావు, నవీన్ కుమార్ లు రూ. 20 లక్షలు లంచం తీసుకుంటుండంగా పట్టుకున్నారు. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు జిన్న శ్రీనివాస్ రెడ్డి, అతని కొడుకు స్నేహిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మరో వ్యక్తి ఉమా మహేశ్వర్, ఔరంగబాద్ లోని లక్ష్మీ అండ్ కో సంస్థతో పాటు మరికొందరిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీబీఐ అధికారులు ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ కూడా (FIR) జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో కూడా కేసు వివరాలను సమర్పించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న జిన్నా శ్రీనివాస్ రెడ్డి, అతని తనయుడు స్నేహిత్ రెడ్డిలది స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కాగా కొంతకాలం కరీంనగర్ లో కూడా నివాసం ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న వీరి ద్వారానే లంచం తీసుకుంటుండగా CBI అధికారుల బృందం పట్టుకుంది.
అసలేం జరిగిందంటే..?
FCIలో ఓ కాంట్రాక్టు పనిని జిన్నా శ్రీనివాస్ రెడ్డి భాగస్వామిగా ఉన్న లక్ష్మీ అండ్ కో సంస్థకు సబ్ లీజు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా CBI అధికారులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. జిన్నా శ్రీనివాస్ రెడ్డి, ఆయనకు సహరించిన వారంతా కూడా గత పిబ్రవరి నెల నుండి ఇందుకు సంబంధించిన పనిలో నిమగ్నం అయినట్టుగా సీబీఐ అదికారులు గుర్తించారు. లంచం ముట్టజెప్పడానికి ముందు సదరు అధికారులతో సమావేశమై నేరుగా అందజేసేందుకు ఒప్పందం జరిగినట్టుగా తేల్చారు. ఇందుకు సంబంధించి లంచం ఇస్తుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.