దిశ దశ, దండకారణ్యం:
ఆంధ్రా ఒడిశా బార్డర్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య మావోయిస్టులకు, బలగాలకు మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ మరణించినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. చత్తీస్ గడ్ రాష్ట్రంతో పటు ఏపీకి చెందిన బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారస పడడంతో ఎన్ కౌంటర్ జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. ఏపీకి చెందిన బలగాలు. మావోయిస్టు పార్టీకి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసు వర్గాల సమాచారం.
ఆరుగురి మృతి…
అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు పార్టీ నక్సల్స్ మరణించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఆంధ్రా ఒడిషా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (AOBSZCM) మెతూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ శంకర్ అలియాస్ బాబుతో పాటు మరో ఐదుగురు మావోయిస్టు పార్టీ శ్రేణులు చనిపోయినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
సెర్చింగ్ ఆపరేషన్…
అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏఓబీ ప్రాంతానికి భారీ సంఖ్యలో చేరుకున్న మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఎదురు కాల్పుల అనంతరం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఆరుగురి మృతదేహాలను గుర్తించాయి బలగాలు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన బలగాలు మరి కొంతమంది మావోయిస్టులు కాల్పుల్లో గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎన్ కౌంటర్ నుండి తప్పించుకున్న వారి కోసం మావోయిస్టులు ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.

