కోదాడలో బహుళ అంతస్తుల భవనం…
రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తుల చిట్టా…
దిశ దశ, హైదరాబాద్:
నీటి పారుదల శాఖలో ఈఎన్సీగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన చీటి మురళీధర్ రావు ఆస్తుల చిట్టా వెల్లడించింది తెలంగాణ ఏసీబీ. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 12 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఒక్కరోజులోనే కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను గుర్తించింది.

వివరాలివే…
హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఒక విల్లా, నాలుగు ఫ్లాట్లు, మరో నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఒక వాణిజ్య భవనం, 6,500 చదరపు గజాల ఓపెన్ ల్యాండ్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, జహీరాబాద్ లో 2KV సోలార్ పవర్ ప్రాజెక్ట్, కరీంనగర్ లో వాణిజ్య భవనం, కోదాడలో బహుళ అంతస్థుల భవనం, వరంగల్ లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం, ఒక బెంజ్ కారుతో సహా మూడు వాహనాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు నిలువలు ఉన్నాయని ఏసీబీ అధికారుల సోదాల్లో బయట పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
రిటైర్ అయినా…
పదవి విరమణ పొందితే తమపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం లేదన్న ధీమాతో ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఏసీబీ అధికారులు ఝలక్ ఇచ్చినట్టయింది. రిటైర్ అయిన తరువాత తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని భావించే అవినీతి అధికారులపై కూడా ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయన్న అభియోగాలపై కేసు పెట్టవచ్చని తేల్చి చెప్పింది. మంగళవారం రిటైర్డ్ ఇరిగేషన్ ENC చీటి మురళీధర్ రావును తెలంగాణ ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

