సర్వేల పేరిట కట్టు కథలు అల్లారు… టికెట్ల కెటాయింపులో అన్యాయం చేశారు…

బోగ శ్రావణిపై రాష్ట్ర అధ్యక్షునికి ఫిర్యాదు…

జగిత్యాల బీజేపీలో రచ్చకెక్కిన విబేధాలు…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాలలో రాజకీయాల పార్టీల్లో సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా ఫిర్యాదుల పరంపర మొదలైంది. మునిసిపల్ ఎన్నికల్లో సర్వేల పేరిట కట్టు కథలు అల్లి తమ అనుయూలకు టికెట్లు ఇచ్చుకున్నారని స్థానిక బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. జగిత్యాల మునిసిపల్ ఎన్నికల్లో టికెట్ల కెటాయింపులో జరిగిన అవకతవకలపై స్థానిక బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఫిర్యాదు చేయడం విశేషం. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న బోగ శ్రావణి, ఆమె భర్త ప్రవీణ్ ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత హైదరాబాద్ కు మకాం మార్చిన బోగ శ్రావణి స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని, స్థానిక క్యాడర్ ను, పార్టీని గాలికి వదిలేశారన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారిని పక్కనపెట్టేసి తన అనయూలకు టికెట్లు ఇచ్చుకున్నారని, ఇదేంటని అడిగితే సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశామంటూ కల్లబొల్లి మాటలు చెప్పారని జగిత్యాల బీజేపీ నాయకులు విమర్శించారు. బోగ శ్రావణి టికెట్లు ఇచ్చిన వారిలో 90 శాతం మందికి డిపాజిట్లు దక్కలేదని, పార్టీ టికెట్ కోసం చివరి క్షణం వరకూ ప్రయత్నించి స్వతంత్రులుగా పోటీ చేసిన తమపై బీజేపీ అభ్యర్థులకు నామ మాత్రంగానే ఓట్లు వచ్చిన విషయాన్ని గమనించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు వివరించారు. 18 నుండి 20 కౌన్సిలర్లను గెలవాల్సిన పరిస్థితుల్లో బోగ శ్రావణి వైఫల్యం వల్ల కేవలం ఆరు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆమె గత ఎన్నికల్లో గెలిచిన వార్డులో కూడా బీజేపీ అభ్యర్థి గెలవలేదని, సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా పట్టించుకోకపోవడంతో కేవలం ఇద్దరు మాత్రమే బీజేపీ సర్పంచులు గెలిచారని, అది కూడా వారి సొంత బలంతో మాత్రమేనని జగిత్యాల బీజేపీ నాయకులు వెల్లడించారు. ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా తప్పు దారి పట్టించారని, 30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారిని పక్కనపెట్టి తన ఇష్టానుసరంగా నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టికి తీసకెళ్లినా ఆయన కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వారిలో బీజీపీ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి, రెబల్ కౌన్సిలర్లు అరవ లక్ష్మి ACS రాజు, సిరికొండ వరలక్ష్మి శ్రీనివాస్, సీనియర్ నాయకులు చీటీ చంద్రశేఖర రావు, చంధ సుగుణాకర్ రావు, అక్కినపల్లి రవీందర్, ఆంకర్ సుధాకర్, అల్లలా భగవంత రావు, బలేటి శ్రీనివాస్, నవ్వుతూ సురేష్, బుర్ర ప్రమోద్, కుర్మాచలం సతీష్ , బిట్టు తదితరులు ఉన్నారు.