బోగ శ్రావణి ఇంటి వద్ద సభ…
సస్పెండ్ అయిన నాయకుల అభ్యతంరం
దిశ దశ, కరీంనగర్:
జగిత్యాల బీజేపీలో రచ్చ రచ్చ కొనసాగుతోంది. మునిసిపల్ టికెట్ల కెటాయింపు వ్యవహారంపై పార్టీ శ్రేణులు ఇంకా రగిలిపోతూనే ఉన్నారు. పార్టీ తరుపున గెలిచిన వారికి అభినందన సభ ఏర్పాటు చేయగా ఈ సమాచారం అందుకున్న సస్పెన్షన్ కు గురైన నాయకులు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి ఇంటి వద్ద గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరు అవుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో రచ్చ మొదలైంది. బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ కు గురైన సీనియర్ నాయకులు బోగ శ్రావణి ఇంటి ఆవరణలో చేసిన ఏర్పాట్లను తొలగించే ప్రయత్నం చేశారు. గ్రీన్ మ్యాట్ తొలగించడంతో పాటు అతిథులు కూర్చొనేందుకు తీసుకవచ్చిన కుర్చీలను కూడా కిందకు నెట్టేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు బోగ శ్రావణి ఇంటికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి చేశారు: బోగ శ్రావణి
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తమను చంపుతామంటూ బెదిరించి దాడికి పూనుకున్నారని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ అయిన నాయకులపై దుయ్యబట్టారు. ఓ మహిళను అని కూడా చూడకుండా ఇష్టారీతిన వ్యవహరించారని తన భర్త ప్రవీణ్ పై కూడా దురుసుగా ప్రవర్తించారన్నారు.
వారి వాదన ఇలా…
మరో వైపున బోగ శ్రావణి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సభ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన నాయకుల వాదనలు వేరే విధంగా ఉన్నాయి. జగిత్యాలలో పార్టీ కార్యాలయం ఉండగా అక్కడ సభ ఏర్పాటు చేయకుండా శ్రావణి ఇంటి ఆవరణలో ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్న శ్రావణి ఇంటి ముందు ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగారు. మునిసిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు టికెట్లు ఇవ్వకున్నా స్వతంత్రులుగా గెలిచామని పార్టీ అక్కున చేర్చుకున్న వారు ఎందుకు ఓడిపోయారో వివరించాలన్నారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన నాయకులు ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసి జగిత్యాల పరిస్థితులను వివరించి బోగ శ్రావణిపై ఫిర్యాదు చేశారు. తాజాగా సభ ఏర్పాటు చేసిన విషయం తెలుసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో జగిత్యాల బీజేపీలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కినట్టయింది.

