కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరు…
దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తప్పిదాలను ఎత్తిచూపిన NDSA నిపుణులు ప్రధానంగా సీడీఓతో సంబంధం లేకుండానే నడుచుకున్నారని గుర్తించడం గమనార్హం. ప్రాజెక్టుల డిజైన్లలో అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన సీడీఓ ప్రమేయం లేదన్న విషయం తమ విచారణలో తేలిందని తేల్చి చెప్పింది.
CDO భాగస్వామ్యం ఇలా
సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (CDO)తో సంబంధం లేకుండానే నిర్మాణాలు జరిపినట్టుగా ఎన్డీఎస్ఏ పేర్కొనడం గమనార్హం. డిజైన్లు తయారు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న సీడీఓ వద్దే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాటా లేకపోవడం ఆందోళన కల్గిస్తోందని, ఇన్వెస్టిగేషన్, గ్రౌండ్ ఇంప్రూవ్ మెంట్, నిర్మాణంలో సీడీఓ విభాగం పాత్ర లేకుండానే ముందుకు సాగడం అసాధరణమైన చర్యగా వివరించింది. ఎప్పటికప్పుడు సీడీఓ విభాగంలోని నిపుణులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి ప్రాజెక్టు నిర్మాణ యూనిట్ డిజైన్లు, డ్రాయింగ్ లను పరిశీలించనట్టుగా అర్ధం అవుతోందని ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించింది. నిర్మాణంలో ఉన్న బ్యారేజీని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం సీడీఓ పరిదిలో లేకుండా పోయిందని, దీని ఫలితంగా యూనిట్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (Floating Structure)కు అనుగుణంగా బ్యారేజీల నిర్మాణం జరగలేదని వివరించింది. నిర్మాణాలను రిజిట్ స్ట్రక్చర్స్ (Rigid Structure)గా నిర్మించారని అభిప్రాయపడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ, దిగువ ప్రాంతంలో సికెంట్ పైల్స్ కట్ఆఫ్ ను రాప్ట్ తో అనుసంధానం చేశారని, మేడిగడ్డ బ్యారేజీ కనెక్షన్ జాయింట్ ను రాప్ట్ నుండి వేరు చేశారని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ యూనిట్ అభ్యర్థనలకు అనుగుణంగా సీడీఓ విభాగం పలు డిజైన్లను మార్పులు చేసినప్పటికీ వాటిని అమలు చేయలేదని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టం చేసింది. ఆర్సీసీ పిల్లర్ల కింద వాటిని తొలగించడం, రాప్ట్ లోతును పెంచడం, సీసీ బ్లాకుల పరిమాణాన్ని పెంచడం, వైర్ గాబియన్ స్థానంలో అప్ స్ట్రీమ్ అప్రాన్ లో రాతి నిర్మాణాలను చేపట్టడం వంటి కొన్న సవరణలను పరిగణనలోకి తీసుకోలేదని, ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ యూనిట్ సీడీఓ సూచనల మేరకు జియోటెక్నికల్ ఇన్ పుట్స్ అందించాల్సి ఉండడంతో పాటు సీడీఓ అందించిన డిజైన్లను, డ్రాయింగ్ లను పూర్తిగా అమలు చేయాల్సి ఉన్నా ఈ మేరకు నిర్మాణంలో పాటించిన దాఖలు కనిపించలేదని స్పష్టం చేసింది. బ్యారేజ్ సైట్ వద్ద గేజ్ డిశ్చార్జ్ కర్వును ప్రాజెక్టు నిర్మాణ యూనిట్ కానీ నీటి పారుదల విభాగానికి చెందిన సీడీఓ కానీ ధృవీకరించలేదని, ప్రాజెక్ట్ సమగ్ర నివేదికను (DPR) సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు పరిశీలిస్తున్న క్రమంలోనే మూడు బ్యారేజీల నిర్మాణం చేపట్టారని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం గురించి సాంకేతికపరమైన ఆర్థిక పరమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధ్యయనం చేస్తుండగానే నిర్మాణాలు కానిచ్చేశారని వెల్లడించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ముందస్తు బౌగోళిక సాంకేతిక పరిశోధనలు లేకుండానే హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ కోసం పరిగణనలోకి తీసుకున్న వరద ప్రవాహం అంచనాలను సీడబ్లుసీ ఆమెదించిన డీజైన్ కు అనుగుణంగా జరగలేదని అభిప్రాయపడింది.