Phone Tapping: సంఘ విద్రోహ శక్తులా… మావోయిస్టు సానుభూతి పరులా..?

బీజేపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ పై సరికొత్త చర్చ…

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన ట్యాపింగ్ కోసం అప్పటి అధికారులు ఏ కారణం చూపారు..? వీరి ఫోన్ ట్యాపింగ్ వల్ల సమాజానికి ఎంతటి ప్రమాదాన్ని నివారించవచ్చని భావించారు..? సైద్దాంతిక విబేధాలు ఉన్న బీజేపీ, మావోయిస్టు పార్టీ నాయకులు చేతులు కలిపే అవకాశం ఉంటుందా..? సంఘ విద్రోహ శక్తులుగా మారేంత సీన్ ఉందా..?

బీజేపీ నేతలకు పిలుపు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ ఒక్కోక్కరిని పిలిపించి వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నం అయింది. ఇప్పటికే ఈ కేసులో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ల వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్ణయించింది సిట్. అయితే తాజాగా మరి కొంతమంది నాయకులకు కూడా సిట్ నుండి పిలుపు రావడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఇందులో బీజేపీ కరీంనగర్ లోకసభ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఒకరు కావడం కూడా గమనార్హం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి ప్రవీణ్ రావుకు ఫోన్ చేసిన పోలీసులు నోటీసు పంపిస్తామని విచారకు రావాలని సూచించారు.

వీరెవరూ..?

తెలంగాణాలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు కాంటాక్ట్ నంబర్లు ట్యాపింగ్ చేసిన SIB అధికారుల బృందం అసలు వీరు ఎవరికి సహకరిస్తున్నారని నివేదిక ఇచ్చారన్న చర్చ మొదలైంది. బీజేపీ నాయకుల నంబర్లను ట్యాప్ చేసేప్పుడు మావోయిస్టులకు సహకరిస్తున్నారని చూపించారా లేక సంఘ విద్రోహ శక్తులతో మిలాఖత్ అయ్యారని చూపించారా అన్నదే అంతు చిక్కకుండా పోయింది.

మావోయిస్టులా..?

సైద్దాంతికంగా విబేధాలతో ముందుకు సాగే మావోయిస్టు, బీజేపీ నాయకులు చేతులు కలిపే అవకాశం ఉంటుందా..? హిందుత్వ నినాదంతో ముందుకు సాగే కాషాయం నేతల సహకారాన్ని కామ్రేడ్స్ తీసుకుంటారా..? మావోయిస్టు పార్టీని నిరిద్వందంగా వ్యతిరేకంచే బీజేపీ నాయకులు ఆ  పార్టీకి సహరించేందుకు సాహసిస్తారా..? అసలు వారు నక్సల్స్ కార్యకలాపాలకు అండగా నిలిచే అవకాశం ఉంటుందా అన్నదే పజిల్ గా మారింది. మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని తయారు చేసిన జాబితాలో బీజేపీ నాయకుల ఫోన్ నంబర్లు కూడా చేర్చినట్టయితే…  SIB అధికారులే అయినా ఇందుకు అనుకూలంగా వ్యవహరించిన ఇతర పోలీసు అధికారులే అయినా తప్పులే కాలేసినట్టేనని చెప్పక తప్పదు. బీజేపీ హిందుత్వ నినాదాన్ని పదే పదే వ్యతిరేకించే మావోయిస్టు పార్టీ నాయకులు వారితో సంప్రదింపులు జరిపి సహకారం తీసుకుంటారా అన్నదే పజిల్ గా మారింది.

సంఘ విద్రోహ శక్తులతోనా…

ఒకవేళ తెలంగాణ బీజేపీ నాయకులు సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపారన్న కారణం చూపించినట్టయితే ఈ శక్తులు ఎవరూ..? అసాంఘీక శక్తులతో చేతులు కలిపిన బీజేపీ నాయకులు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న నివేదికలు నిఘా వర్గాల వద్ద ఉన్నాయా అన్నది తేల్చాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కేసులు నమోదు కానప్పటికీ  నాయకులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేయడం చట్ట విరుద్దం కాదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. తెలంగాణాలోని బీజేపీ ఎంపీలు, ఇతర నాయకులు మావోయిస్టులకు సహకరించినా… సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపినా కేంద్ర నిఘా వర్గాల దృష్టికి ఇంతవరకు రాకపోవడం గమనార్హం. మావోయిస్టులకు తెలంగాణ బీజేపీ నేతలు సహకరించినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్టయితే వారిపై పార్టీ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా..? వారికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండదు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ చేసేందుకు SIB ఎలా ముందుకు వెల్లిందన్నది తేలితే మాత్రం ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.