సరస్వతి నదికి నీరాజనాలు…
దిశ దశ, కాళేశ్వరం:
‘‘కాళేశ్వర నివాసోవా,కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం’’
అని స్తుతిస్తూ భక్తులు త్రివేణి సంగమ తీరాన పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
త్రివేణి సంగమం భక్తుల రాకతో కిక్కిరిసిపోతోంది. సువిశాలంగా విస్తరించిన త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు చేరుకుంటున్నారు. అంతర్వాహిని సరస్వతి నదిలో స్నానమాచరించిన భక్తులు పుణీతులై నీరాజానాలు అర్పిస్తున్నారు. ఆరో రోజు కూడా భక్తుల తాకిడీ తీవ్రంగా పెరగడంతో అధికార యంత్రాంగం సేవలందించే పనిలో నిమగ్నం అయింది. త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద భక్తులు నది లోపలకు వెళ్లకుండా ఉండేందుకు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా చొరవ తీసుకుంటున్నారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచిన అధికారులు భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా పకడ్భందీ చర్యలు చేపట్టారు.
ఆరో రోజు…
పుష్కర నదికి మొదటి 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను అనసరించి భక్తులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పురణాలు చెప్తున్నాయి, ప్రకృతిలో భాగమైన నదుల వద్ద సహజత్వాన్ని పెంపొందించేందుకు భక్తులు కూడా చొరవ తీసుకోవాలన్న సంకల్పంతోనే హైందవ ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. ప్రాకృత్య ధర్మానికి మించింది మరోటి లేదన్నది చేతల్లో చూపించేందుకే పూర్వీకులు ఈ సాంప్రాదాయాలను కొనసాగించే వారు. పుష్కర నది తీరంలో ఆరో రోజున ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలని పురణాలు వివరించాయి. ఈ రోజు పుష్కర సరస్వతి ఒడిలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు దానాలు చేయడం మంచిదని చెప్తున్నాయి. ఆరో రోజైన మంగళవారం తెలంగాణ, ఏపీ, చత్తీస్ గడ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటకల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరం చేరుకున్నారు.