మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన దాడులన్నింటికి హిడ్మానే బాధ్యుడిని చేస్తూ తప్పుడు ప్రచారం చేశారని, ఆయన ఎన్ కౌంటర్ బూటకమని మాజీ ఎమ్మెల్యే, బస్తారియా రాజ్ మోర్చా నాయకుడు మనీష్ కుంజం ఆరోపించారు. శుక్రవారం సుక్మా జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు జరిగిన దాడులు కూడా హిడ్మా నేతృత్వంలోనే జరిగాయని దుష్ప్రచారం చేశారన్నారు. 50 మంది ఏక కాలంలో ఏపీలో ఎలా అరెస్ట్ అవుతారని వారు అక్కడకు ఎందుకు వెల్తారని మనీష్ కుంజం ప్రశ్నించారు. మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్ జీ వీరందరిని ఏపీకి తీసుకెళ్లి సరెండర్ చేయించి, తన భవిష్యత్తు కోసం ఇలా చేశారని ఆరోపించారు. వారంతా అరెస్ట్ అయితే చత్తీస్ గడ్ లోనే అవుతారని ఇందులో ఎక్కవ మంది సుక్మా, బీజాపూర్ తో పాటు సమీప ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. ఈ నేఫథ్యంలోనే హిడ్మాను చంపేయాలని దేవ్ జీనే పోలీసులకు చెప్పారని ఆరోపించారు. దండకారణ్యంలో జరిగిన అన్ని దాడులకు మాస్టర్ మైండ్ హిడ్మా అన్న ప్రచారం చేశారని, అయితే తెలంగాణ, ఆంధ్రాలకు చెందిన వారే నాయకత్వం వహిస్తున్నారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని మనీష్ కుంజం అన్నారు. హిడ్మాను చంపిన తరువాత మిగతా వారంతా సేఫ్ అయ్యారని, తెలుగు నాయకులంతా ఇక్కడి ప్రభుత్వంతో కలిసి క్షేమంగా ఉన్నారన్నారు. తాడిమెట్ల ఘటన సమయంలో రామన్న సబ్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారని, 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో కూడా వేరే నాయకులు సారథ్యం వహించారన్నారు. అప్పుడు జోనల్ కమిటీలో ఉన్న హిడ్మాను బాధ్యుడిని చేశారని మనీష్ కుంజం ఆవేదన వ్యక్తం చేశారు. జీరంఘాట్ ఘటనలోనూ హిడ్మాదే మాస్టర్ మైండ్ అన్నారని, క్యాంపును దగ్దం చేసిన ఘటనకు కూడా ఆయన్నే బాధ్యుడిని చేశారన్నారు. బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ప్రతి ఘటనలోనూ తమ ప్రాంత ఆదివాసీ యువకులను బద్నాం చేశారన్నారు. దండకారణ్యంలో జరిగిన ప్రతి ఘటనకు కూడా ఆంధ్రా నాయకులే బాధ్యత అని బస్తర్ ప్రాంత యువకులు నాయకుల ఆదేశాలను పాటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఏది చెప్తే అది చేశారని, బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో హిడ్మా మాస్టర్ మైండ్ లేదని, మాస్టర్ మైండ్ అంతా కూడా ఆంధ్రా వారిదేనని మనీష్ కుంజం ఆరోపించారు. నక్సల్స్ కు వ్యతిరేకంగా ఏర్పడిన సల్వాజుడుం ఏర్పాటుకు కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.
ఇక్కడే లొంగిపోండి…
చత్తీస్ గడ్ కు చెందిన మావోయిస్టు పార్టీ శ్రేణులు తెలంగాణ, ఏపీకి వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే లొంగిపోవచ్చని మనీష్ కుంజం సూచించారు. స్థానిక పోలీసులపై విశ్వాసం ఉందని లొంగిపోయేందుకు వచ్చే వారికి తాను అండగా ఉంటానన్నారు.
మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం వ్యాఖ్యల వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి:
https://www.facebook.com/share/v/19C1h3xe5M/

