కమిషన్ ఎర… యువకుల చెర… సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు…

12 మంది నిందితుల అరెస్ట్…

దిశ దశ, కరీంనగర్:

సాంకేతికత విభాగంలో డిగ్రీలు పూర్తి చేసి ఉపాధి పొందుతారని కలలు కన్న వారి తల్లిదండ్రుల ఆశలను కల్లలు చేశారు. సైబర్ నేరగాళ్ల ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి ఉజ్వల భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకున్నారు. బీటెక్ చేసి పూర్తి చేసి సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడతారనుకున్న ఆ యువకులు ఇఫ్పుడు చెరసాలకు వెల్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆధివారం 12 మంది సైబర్ క్రిమినల్ ముఠాను అరెస్ట్ చేశారు. మ్యూల్ అకౌంట్ల ముసుగులో ఆదాయం ఆశ చూపిస్తూ ఎర వేసిన వారిని గుర్తించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.

అంతర్జాతీయంగా…

ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్ వేసిన వలలో చిక్కుకున్న వారిపై కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మ్యూల్ అకౌంట్లను క్రియేట్ చేయించి కమిషన్లు ఎరగా వేస్తున్న వారిని పట్టుకునేందుకు ‘‘ఆపరేషన్ క్రాక్ డౌన్’’ చేపట్టారు పోలీసులు. ఇందులో భాగంగా ఇటీవల కొంతమందిని అరెస్ట్ చేయగా తాజాగా మరో ముఠా గుట్టు రట్టు చేశారు.

బీటెక్…

బీటెక్ చదువుతున్న, పూర్తి చేసిన వారినే ఈ నేరాల్లో సైబర్ క్రిమినల్స్ భాగస్వాములును చేశారు. మ్యూల్ అకౌంట్లను ఓపెన్ చేయడం, వారి పేరిట సిమ్ కార్డులు, ఇతరాత్ర డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకుని ఏజెంట్ల ద్వారా అంతర్జాతీయ నేరగాళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో అకౌంట్ కు రూ. 10 వేల వరకు ఇప్పిస్తూ, ఈ ముఠాలోని 12 మంది కూడా తమ కమిషన్లు తీసుకుంటున్నారని, అలాగే లావాదేవీలు జరిపినప్పుడు సైబర్ క్రిమినల్స్ ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది., మ్యూల్ అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయలు తమ అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఇచ్చే బోటాబోటి కమిషన్ కోసం కరీంనగర్ యువత దారి తప్పడం విస్మయానికి గురి చేస్తోంది.

లీడర్ తీరిలా…

ఇకపోతే ఆదివారం కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాకు నేత‌ృత్వం వహిస్తున్న ముదుగంటి రాజేశ్వర్ రెడ్డి (22), కరీంనగర్ భగత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం బీటెక్ పూర్తి చేసిన ఈయన ఎథికల్ హ్యాకింగ్ కోర్సు కోచింగ్ తీసుకుంటూ సైబర్ నేరాల్లో భాగస్వామ్యం అవుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాలో కిసాన్‌నగర్ కు చెందిన నందగిరి సాయి వర్ధన్ (22), దోభివాడకు చెందిన కాలిదాస్ కౌశిక్ (23), కట్టరాంపూర్ కు చెందిన ములంకుల రాజ్‌కుమార్ (23), శంకరపట్నం మండలం కన్నాపూర్ కు చెందిన బండి సాయి కృష్ణ (26), కరీంనగర్ విద్యానగర్ కు చెందిన అడవెల్లి సాయి కార్తిక్ (23), సవరన్ స్ట్రీట్ కు చెందిన మీర్ జామీద్దీన్ (22), మహ్మద్ జావాద్ ఖాన్ (23), కోతిరాంపూర్ కు చెందిన సర్దార్ దల్జిత్ సింగ్ (23), రామడుగు మండలం వెంకట్రావుపల్లి లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పల్లెర్ల అజయ్ (24), కరీంనగర్ మారుతి నగర్ కు చెందిన నిర్మల్ల శివ (23), చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన దిద్ది సాయిచరణ్ (22)లను అరెస్ట్ చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మీడియాకు వెల్లడించారు. సైబర్ క్రిమినల్ ముఠాను పట్టుకోవడంలో సక్సెస్ అయిన కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనాథ్, పోచయ్య, సైబర్ క్రైమ్ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది అనిల్, వసీం, ఖాజా పాషా, రవి, వెంకటేష్, కృష్ణా రెడ్డి, శ్రీనివాస్, శంకర్, లక్ష్మణ్, సాయి కృష్ణ , అభినవ్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఈ ముఠా సభ్యులు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని మరో ఆరుగురు కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారని సీపీ వివరించారు.