అక్కడ… కామ్రేడ్స్… కారు కలిసి పోటీ..!

దిశ దశ, చెన్నూరు:

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతున్న కామ్రేడ్స్ అక్కడ మాత్రం గులాభి పార్టీతో చేతులు కలిపారు. అంతటా కాంగ్రెస్, కామ్రేడ్స్ కలిసి పోటీ చేయాలని నిశ్చయించుకుంటే.. ఆ మునిసిపాలిటీలో మాత్రం వైవిద్యమైన నిర్ణయం తీసుకున్నారు.

క్యాతన్ పల్లి…

క్యాతన్ పల్లి మునిసిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ మధ్య సయోధ్య కుదిరింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానిక సీపీఐ నేతలతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు. ఈ మునిసిపాలిటీలో 22 వార్డులు ఉండగా 8 చోట్ల సీపీఐ, మిగతా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో నిలపనుంది. క్యాతన్ పల్లిలో కమ్యూనిస్టులకు పట్టున్న నేపథ్యంలో వారితో కలిసి పోటీ చేసినట్టయితే మునిసిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని భావించిన బాల్క సుమన్ స్థానిక నాయకులతో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు పార్టీల నాయకులు అధికారికంగా ప్రకటన కూడా చేశారు.

అధికార పార్టీ..?

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతుండగా క్యాతన్ పల్లి విషయంలో మాత్రం స్థానిక నాయకత్వం నిర్ణయానికే సీపీఐ రాష్ట్ర నాయకత్వం సానుకూలత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మధ్య అంతరం పెరిగినట్టుగా స్పష్టం అవుతోంది. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు నిరూపించుకోవాలన్న యోచనతోనే పొత్తు కుదిరినట్టుగా స్సష్టం అవుతోంది. అయితే బాల్క సుమన్, సీపీఐ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన కామ్రేడ్స్ క్యాతన్ పల్లి మునిసిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుండడం మాత్రం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.