కేసు బుక్… క్లోజ్…
చివరకు ఏం జరిగిందంటే…
దిశ దశ, కరీంనగర్:
అక్రమంగా వచ్చే సొమ్మును బినామీ అకౌంట్ కు బదిలీ చేసిన వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సదరు ఉద్యోగి తన బినామీ అకౌంట్ నంబర్ మార్చేశారంటూ కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలోని వర్క్స్ అండ్ అకౌంట్స్ జాయిట్ డైరక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ఈగల మధుసూధన్ ను ఈ నెల 16న అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ. 14 లక్షల లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అక్రమంగా సంపాదించిన సొమ్మేనని తేల్చింది. అయితే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసే ముందు పెద్ద తతంగమే జరిగినట్టుగా తెలుస్తోంది.
కేసు నమోదు…
కరీంనగర్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న ఈగల మధుసూధన్ మామూళ్ల కోసం ఓ బినామీ అకౌంట్ ఓపెన్ చేయించాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేరిట బినామీ అకౌంట్ ను ఓపెన్ చేయించాడు. ఈ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి అప్పగించారు. అయితే ఈ అకౌంట్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం బినామీ వ్యక్తికి సంబంధించిన మొబైల్ నంబర్ సదరు బ్యాంకులో యాడ్ చేసుకున్నాడు. దీంతో అప్పటి వరకు ఈ అకౌంట్ వివరాలేవి తెలియకపోవడంతో పాటు తనకు రావాల్సిన డబ్బులు దారిమల్లుతున్నాయని గమనించాడు మధుసూధన్. దీంతో తనకు సంబంధించిన అకౌంట్ మొబైల్ నంబర్ మార్చుకున్నారని కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మధుసూధన్ ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అకౌంట్ అతనిది కాదని గుర్తించిన పోలీసులు తప్పుడు ఫిర్యాదు చేశారని కేసును మూసి వేశారు. మధుసూధన్ బినామీ అకౌంట్ విషయంలో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసినట్టయితే లాభం జరుగుతుందని ఆశించినప్పటికీ రికార్డులను పరిశీలించిన తరువాత కేసును క్లోజ్ చేయడంతో అతని అంచనాలు తలకిందులు అయ్యాయి. దాదాపు రెండు మూడు నెలల క్రితం కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మధుసూధన్ తో అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తిని నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపగా ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయబేధాలు కాస్తా ఏసీబీకి ఫిర్యాదు వరకు వెల్లినట్టుగా స్థానికంగా చర్చ సాగుతోంది.

