జమ్మికుంట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత… స్వతంత్రులపై ఇరు పార్టీల గురి…

దిశ దశ, జమ్మికుంట:

జమ్మికుంట మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫలితాలు వెలువడిన తరువాత పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం కౌంటింగ్ కేంద్రం నుండే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కౌంటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన స్వతంత్ర కౌన్సిలర్లను క్యాంపునకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనాల్లో ఎక్కిన కౌన్సిలర్లను కారు దింపేందుకు బయటకు లాగారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా స్వతంత్ర అభ్యర్థులను తాము ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించాలని భావించారు. ఈ క్రమంలో పెనుగులాట చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా భారీగా జమ్మికుంటకు చేరుకున్నారు. జమ్మికుంటలో మొత్తం 30 స్థానాలు ఉండగా బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10 స్థానాలను, బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకోగా స్వతంత్రులు ముగ్గురు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఒకరు గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్రుల సహకారంతో ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థులను తాము ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించేందుకు ప్రయత్నించారు. మరో వైపున బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు. చివరకు అతన్ని బీఆర్ఎస్ పార్టీ శిబిరానికి తరలించారు. ఒక స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ శిబిరానికి తరలించింది.

బీజేపీకి ఆఫర్..? 

జమ్మికుంటలో మద్దతు ఇచ్చినట్టయితే వైస్ ఛైర్మన్ పదవిని అప్పగిస్తామన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ మేరకు స్థానిక బీజేపీ నేతలతో మంతనాలు జరిపే యోచనలో ఉన్నట్టుగా సమాచారం.

రంగంలోకి పోలీసులు… 

జమ్మికుంట కౌంటింగ్ హాల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ డీసీపీ వెంకట రమణ, హుజురాబాద్ ఏసీపీ వి మాధవిలు హుటాహుటిన చేరుకున్నారు. పోలీసులు కూడా ఇరు పార్టీల నాయకులను  కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.