ఆర్ఎఫ్సీఎల్ పనితీరు…
దిశ దశ, రామగుడం:
యూరియా ఉత్పత్తి కోసం రామగుండంలో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్సీఎల్ లో తరుచూ సాంకేతిక సమస్యలు ఎదురు కావడానికి కారణం ఏంటీ..? నిరంతరంగా ఎదురవుతున్న అవాంతరాలను వెంటనే అధిగమించలేక పోకపోవడమేంటీ..? రామగుండంలో ఉన్న కంపెనీ కార్పోరేట్ ఆఫీస్ ఢిల్లీలోని నోయిడాలో ఉండడం వల్ల కలుగుతున్న అనర్థాలు ఏంటీ..?
తరుచూ అవాంతరాలు…
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించిన ప్లాంటుకు సంబంధించిన కార్పోరేట్ ఆఫీస్ న్యూ ఢిల్లీలోని నోయిడాలో ఉండడం వల్ల సకాలంలో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తయారైంది. తరుచూ ప్లాంటు లీకేజీలకు గురవుతుండడం వాటిని అధిగమించేందుకు కార్పోరేట్ ఆఫీసుకు సమాచారం ఇవ్వడం… ఇందుకు సంబంధించిన ఎనాలిసిస్ రిపోర్టులు రామగుండం ప్లాంటుకు చేరేవరకూ ఎదురు చూడాల్సి వస్తోంది. సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యల నివేదికలు ఆర్ఎప్సీఎల్ అధికారులు నోయిడాలోని కార్పోరేట్ ఆఫీసుకు పంపించి అనుమతులు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల యూరియా ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఈ సీజన్ లో లక్ష్యానికి అనుగుణంగా యూరియా రైతాంగానికి సకాలంలో అందించే పరిస్థితి లేకుండాపోతోందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అమ్మోనియం ప్లాంటులో లీకేజీ కావడంతో మరోసారి ఉత్పత్తి నిలిచిపోవడంతో చాలినంత యూరియాను అందించే అవకాశం లేకుండా పోయింది. గత జులై 16న సాంకేతిక సమస్య కారణంగా ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోగా సమస్యను అధిగమించేందుకు ఆగస్టు 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. తిరిగి ఈ నెల 14న మళ్లీ ప్లాంటులో టెక్నికల్ సమస్య ఎదురు కావడంతో మళ్లీ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నెల 22 వరకు ప్లాంటును బాగు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అప్పటి వరకు యూరియా ఉత్పత్తి నిలిచిపోవడమే తప్ప మరో ప్రత్యామ్నాయం అయితే లేనట్టుగా తెలుస్తోంది. గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో గతంలో బాగు చేయించినప్పటికీ తరుచూ రామగుండం ప్రాంటులో మాత్రం అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్లాంటులో ఎదురైన లీకేజీ సమస్యను బాగు చేసిన తరువాత మూడు రోజుల పాటు కూలింగ్ పీరియడ్, మూడు రోజుల పాటు స్టార్టప్ పీరియడ్ గా పరిగణించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్లాంటులో సమస్య ఎదురయినప్పుడల్లా ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయడం కార్పోరేట్ కార్యాలయానికి పంపించడం, తీసుకోవల్సిన చర్యల ఏంటీ అన్న విషయం తేలేందుకు ఒకటి రెండు రోజులు పడుతోందని తెలిసింది. కూలింగ్, స్టార్టప్ పీరియడ్ కోసం ఖచ్చితంగా ఆరు రోజులు వేచి చూడాల్సిందేనని దీంతో ఒకసారి లీకేజీ సమస్య ఎదురయితే కనీసం వారం రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోవల్సిందే. రూ. కోటికి పైగా వెచ్చించాల్సిన ప్రతి పనికి కార్పోరేట్ కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
తీవ్ర ప్రభావం…
ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణాలోని వివిధ జిల్లాలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందించాల్సిన ఆవశ్యకత ఆర్పీసీఎల్ పై ఉంది. గత జులైలో లీకేజీ సమస్య కారణంగా దాదాపు 20 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోగా ఆగస్టు 4 నుండి ఉత్పత్తి ప్రారంభం అయింది. దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయిన తరువాత తిరిగి ఆగస్టు 14న లీకేజీ సమస్య ఎదురు కావడంతో మళ్లీ 22 వరకు యూరియా సిద్దమయ్యే అవకాశం లేకుండా పోయింది. రోజుకు 3 వేల 3800 నుండి మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉన్న ఈ పరిస్థితుల్లో మరోసారి లీకేజీ సమస్య ఎదురుకావడం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన ప్రభావం పడనుంది. తరుచూ లీకేజీలు వస్తుండడంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు ఖరీఫ్ కు సరిపడా యూరియా ఉత్పత్తి చేయడం అసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎంపీ లేఖ…
రామగుండంలో మాత్రమే ఉన్న RFCL ప్లాంటు కోసం కార్పోరేట్ ఆఫీసు ఇక్కడే ఉన్నట్టయితే సత్వరమే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, ముందుగానే ప్లాంటులో ఎదురయ్యే సమస్యలను గుర్తించే వీలుంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అంటున్నారు. నిపుణులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్నట్టయితే అన్నింటా బావుంటుందన్న విషయాన్ని గుర్తెరగాలని సూచిస్తున్నారు. RFCL కార్పోరేట్ ఆఫీసును స్థానికంగానే ఏర్పాటు చేయాలని లేనట్టయితే హైదరాబాద్ లో అయినా ఏర్పాటు చేయాలని కోరుతూ తాజాగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు సంబంధించిన కార్పోరేట్ కార్యాలయాలు ఆయా రాష్ట్రాల్లోనే ఉన్నాయని, అదే విధానం RFCL విషయంలోనూ అమలు చేయాలని ఆగస్టు 12న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన రెండో రోజునే మళ్లీ ప్లాంటులో అవరోధం ఏర్పడడం, ఉత్పత్తి నిలిచిపోవడం గమనార్హం.
ఛలో ఢిల్లీ: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
RFCL విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. యూరియా ఉత్పత్తి కోసం పునరుద్దరించిన ఈ ప్లాంటు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. RFCLలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 30 శాతం వాటా తెలంగాణాకే కెటాయించాలని మక్కాన్ సింగ్ డిమాండ్ చేశారు. హెడ్ ఆఫీసును రామగుండంలో ఏర్పాటు చేయాలని, యూరియా రవాణాలో స్థానిక లారీ యజమానులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు లేనట్టయితే ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

