ఆగని వసూళ్లు… ఆందోళనలో లారీ యజమానులు…

భూపాలపల్లి, ములుగు జిల్లాల రీచుల్లో ఏం జరుగుతోంది..?

దిశ దశ, భూపాలపల్లి:

అన్ని రకాల ఛార్జీలు వసూలు చేసిన తరువాతే అనుమతులు ఇస్తున్నప్పటికీ రీచుల్లో అక్రమ వసూళ్లకు కారణమేంటీ..? లారీల యజమానులు అధికారులకు ఫిర్యాదు చేసినా మార్పు రాకపోవడం ఏంటీ..? అసలు ఇసుక రీచుల్లో ఏం జరుగుతోంది..?

ఛార్జీల వివరాలు ఇలా…

మెట్రిక్ టన్నుకు రూ. 375 చొప్పున వసూలు చేస్తున్న టీజీఎండీసీ ఇసుక కోసం మాత్రమే డబ్బులు తీసుకోవడం లేదు. వివిధ రకాల ఛార్జీల పేరిట బాజాప్తాగా లారీల యజమానుల నుండి వసూలు చేస్తోంది. లారీల సామర్థ్యాన్ని బట్టి అందులో లోడింగ్ చేసే ఇసుకను బట్టి టీజీఎండీసీకి లారీల యజమానులు ముందుగానే డబ్బులు చెల్లించాలి. ఆ తరువాతే సాండ్ ఆర్డర్ రిసిప్ట్ ఆన్ లైన్ ద్వారా జారీ అవుతుంది. ఇసుక కోసం చెల్లించే డబ్బుల్లో 2.50 శాతం చొప్పున సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కూడా వసూలు చేస్తోంది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 5 శాతానికి మించి ఓవర్ లోడ్ వెల్తే నిబంధనల ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామన్న హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మెట్రిక్ టన్నుకు రూ. 15 చొప్పున సర్ ఛార్జీలు, లారీ సామర్థ్యాన్ని బట్టి రూ రోడ్ డ్యామేజీ చార్జీలు, వెయిమెంట్ ఛార్జీలు, ఇందుకు 9 శాతం చొప్పన సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కోసం లారీల యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. సాండ్ ఆర్డర్ రిసిప్ట్ తీసుకుని సంబంధిత రీచుకు వెళ్లిన తరువాత ఇసుక నింపి పంపించాల్సిన బాధ్యత రీచుల నిర్వాహకులది. అయితే తమకు గిట్టుబాటు కావడం లేదన్న బూచి చూపిస్తూ ఇసుక రీచుల్లో ఒక్కో లారీకి రూ. 3 వేల నుండి 3,500 వరకు వసూలు చేస్తున్నారని యజమానులు టీజీఎండీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగంలోకి దిగడంతో ఏవో కారణాలు చూపించి కరీంనగర్ జిల్లాలోని మూడు రీచుల్లో ఇసుక లోడింగ్ నిలిపివేశారు. ఆ తరువాత లోడింగ్ ఛార్జీల వసూళ్లపై కట్టడి చేయడంతో యథావిధిగా ఇసుక రవాణా సాగుతోంది.

అక్కడ ఇలా…

ఇకపోతే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక రీచుల్లో లోడింగ్ ఛార్జీల వసూళ్లలో మార్పు రాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీచుల నిర్వాహాకులు ఒక్కో లారీకి రూ. 2 వేల నుండి 2500 వరకూ వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సుదూర ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాల రీచుల నుండి ఇసుక రవాణా చేయడం కోసం లారీల్లో ఇంధనం కోసం అదనంగా ఖర్చు చేయడంతో పాటు టోల్ ఛార్జీలు కూడా ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోందని లారీ ఓనర్లు అంటున్నారు. అయినప్పటికీ ఈ రెండు జిల్లాల్లో మాత్రం లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నయా స్టైల్…

అయితే రీచుల్లో లోడింగ్ ఛార్జీలు వసూలు చేయడం లేదని సాక్ష్యాధారాలు చూపించేందుకు అక్కడ పని చేస్తున్న వారు సరికొత్త ఎత్తులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. లారీకి ఇంత అని లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ, లారీ డ్రైవర్ల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీల వద్ద డ్రైవర్లను నిలబెట్టి తమ వద్ద రీచుల నిర్వాహకులు లోడింగ్ ఛార్జీలు వసూలు చేయడం లేదంటూ డ్రైవర్లతో చెప్పించిన వీడియోలు రికార్డు చేసుకున్న తరువాతే లోడింగ్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారన్న విమర్శులు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించాలని టీజీఎండీసీ అధికారులను లారీల యజమానులు కోరుతున్నారు.

ఏం చేస్తున్నారు..?

ఇసుక రీచుల్లో రవాణా సక్రమంగా చేసేందుకు టీజీఎండీసీ ప్రత్యేకంగా ప్రాజెక్టు ఆఫీసర్లను, కాంట్రాక్టు పద్దతిలో ఉధ్యోగులను నియమిస్తున్నప్పటికీ నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న ఇలాంటి తంతును కట్టడి చేయకపోవడం వెనక కారణం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. రీచుల వద్ద అక్రమంగా సాగుతున్న వసూళ్ల పర్వాన్ని కట్టడి చేయడానికి వెనుకడుగు ఎందుకు వేస్తున్నారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ విషయంపై భూగర్భ గనుల శాఖ, టీజీఎండీసీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని లారీ ఓనర్లు అభ్యర్థిస్తున్నారు.