దిశ దశ దండకారణ్యం:
ఆంధ్రా ఒడిషా బార్డర్ జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన వారిని గుర్తించారు పోలీసులు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మడావి హిడ్మా అలియాస్ సంతోష్, అతని భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజీ, జిల్లా కమిటీ సభ్యుడు లక్మల్, పీపీసీఎంలు కమ్లూ, మల్ల, హిడ్మా గార్డ్ దేవ్ చనిపోయినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో తిరుగులేని పట్టు ఉన్న హిడ్మా ఏఓబీ ప్రాంతంలో బలగాలకు తారస పడడం సంచలనంగా మారింది. ఆయన ఏపీలోని అల్లూరి సీీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునేందుకు వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చత్తీస్ గడ్ బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఆయనతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా ఏఓబీ అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి 2 ఏకె 47, ఒక రివాల్వర్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.
పది రోజుల క్రితం…
మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం అంతా కూడా జనజీవనంలో కలిసేందుకు బయటకు వస్తున్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా బయటకు రావాలని చత్తీస్ గడ్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే హిడ్మా స్వగ్రామమైన సుక్మా జిల్లా పవ్వర్తికి అక్కడి డిప్యూటీ సీఏం విజయ్ శర్మ వెళ్లారు. హిడ్మాతో పాటు దేవా కుటుంబ సభ్యులను కలిసి బాహ్మ ప్రంపంచంలోకి వచ్చేందుకు పిలుపునివ్వాలని సూచించారు. వారితో పాటు సహపంక్తి భోజనం కూడా చేశారు. హిడ్మా పార్టీని వీడినట్టయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోతుందని భావించి అక్కడి ప్రభుత్వం హిడ్మా లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అనూహ్యంగా మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ నాయకుల్లో హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉండడం సంచలనంగా మారింది. పోలీసు వర్గాలు కూడా హిడ్మా ఉన్నట్టుగా ధృవీకరించడంతో మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చూసిందనే చెప్పాలి.
బాస్ అక్కడే..?
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరిష్ కుమార్ గుప్తా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మారేడుమిల్లి నుండి మావోయిస్టుల ఏరివేతపై సమీక్షిస్తున్నట్టుగా సమాచారం.

