తెలంగాణాలో గన్ డౌన్… మావోయిస్టుల లేఖ

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ తెలంగాణాలో కాల్పుల విరమణ పాటిస్తున్నట్టుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్, సీపీఐ, సీపీఎం పార్టీలు శాంతి చర్చలు జరిపించాలన్న ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేయడంపై మావోయిస్టు పార్టీ స్వాగతించింది. 5/7/2025 తేదిన ఈ లేఖను విడుదల చేసిన ఈ లేఖలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజా స్వామిక వాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు, మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించారు. శాంతి చర్చలు జరపాలన్న ప్రతిపాదన మొదట తెలుగు రాష్ట్రాల నుండి రావడంతో ఇందు కోసం కమిటీ ఏర్పడిందని, దేశ వ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, వ్యక్తులు, ప్రముఖులు, పార్టీలు ఇదే డిమాండ్ చేస్తున్నాయని జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు. అంతర్గతంగా చర్చించి శాంతి చర్చలపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, ఆపరేషన్ కగార్ రద్దు చేసి శాంతి చర్చలు జరపాలని సీపీఐ మొదటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టగా ఇందులో అన్ని వామపక్ష పార్టీలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తన రజతోత్సవ సభలో శాంతి చర్చలు జరపాలని తీర్మానం చేసిందని, కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే డిమాండ్ చేయగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా సానుకూలంగా స్పందించడం హర్షించదగ్గ విషయని జగన్ ఆ ప్రకటనో పేర్కొన్నారు. అనేక మంది మేధావులు, ప్రముఖులు ఇదే విషయంపై ప్రచారం చేస్తున్నారని, వామపక్ష పార్టీలన్ని ఇదే డిమాండ్ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఒక ప్రజాస్వామిక వాతావరణం తీసుకవచ్చే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలన్నారు. ఈ ప్రయత్నాలకు సానుకూలతను కల్గించేందుకు తమ నుండి కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని జగన్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

లేఖపై తర్జనభర్జనలు…

ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ పేరిట విడుదల అవుతున్న ప్రకటనలు, లేఖలు చాలా వరకు ఫేక్ అని, క్రియేటెడ్ అన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదల అయిన లేఖ విషయంలోనూ తర్జనభర్జనలు సాగుతున్నాయి. నిజంగా మావోయిస్టు పార్టీ పంపిన లేఖనా లేక ఇతరులు ఎవరైనా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారా అన్న కోణంలో చర్చ సాగుతోంది. మూడు నెలల క్రితం కర్రె గుట్టల సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో బడే దామోదర్ మరణించాడని మావోయిస్టు పార్టీ దండకారణ్య ప్రాంతానికి సంబంధించిన కమిటీ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఆ తరువాత తాను క్షేమంగానే ఉన్నానని బడే దామోదర్ ప్రకటించడంతో ఆయన చనిపోయినట్టుగా విడుదలైన లేఖ తప్పని తేలిపోయింది. అంతేకాకుండా కర్రె గుట్టల వైపునకు ఆదివాసీలు ఎవరూ రాకూడదని కోరుతూ మావోయిస్టు పార్టీ పేరిట విడుదల అయిన లేఖ కూడా తప్పుడుదేనని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అదికార ప్రతినిధి జగన్ పేరిట విడుదల అయిన లేఖ నిజమైనదేనా కాదా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోతోంది. మరో వైపున కాల్పులు విరమణ గురించి కేంద్ర కమిటీలో చర్చ జరిగడమో లేక అత్యవసరంగా తీసుకున్న నిర్ణయం అయితే కేంద్ర కమిటీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే ఇలాంటి కీలక నిర్ణయాలకు సంబంధించిన లేఖలు విడుదల అవుతుంటాయి. కేంద్ర కమిటీ కూడా పార్టీ శ్రేణులకు సమాచారం చేరవేసిన తరువాతే బాహ్య ప్రపంచంలోకి ప్రకటన విడుదల చేసే విధానం అమల్లో ఉంది. కానీ మే7వ తేదిన కాల్పుల విరమణకు సంబంధించిన లేఖ విడుదల కాగా 8వ తేది ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలపై కాల్పులు జరపడం… ఇందులో ముగ్గురు కమెండోలు చనిపోవడం, ఆర్ఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ లేఖపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున ఈ లేఖ కూడా గురువారం మద్యాహ్నం నుండి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పులకు ఒక రో్జు ముందే లేఖను మావోయిస్టులు విడదల చేసినట్టయితే ఘటన తరువాత లేఖ వైరల్ కావడం వెనక ఏదైనా కారణం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. వాస్తవంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాలు కూడా శాంతి చర్చల ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటన చేయడం సముచితమే అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుండి శాంతి చర్చల సానుకూలత మాత్రమే వ్యక్తం అయింది కానీ కాల్పుల విరమణపై మాత్రం స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రకటన మాత్రం మావోయిస్టులు ముందుగానే కాల్పుల విరమణ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఇరు పక్షాలు ఏకకాలంలో తమ నిర్ణయాలు వెల్లడించిన సందర్బాలు ఉంటాయి కానీ, ఒక పక్షమే సానుకూలతను ప్రకటించడం ఏమిటా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామన పాలకులు పదేపదే ప్రకటించినప్పుడు పీపుల్స్ వార్ అగ్ర నాయకత్వం కాల్పుల విరమణ చేపట్టాలన్న డిమాండ్ ను వినిపించింది. గ్రామాల్లో కూంబింగ్ చేపట్టడం, బేస్ క్యాంపులు తొలగించడం వంటి వాటిని కూడా ప్రతిపాదించారు. ఇటీవల చత్తీస్ గడ్ లో శాంతి చర్చలకు తాము సానుకూలంగా ఉన్నామని కేంద్ర కమిటీ, అక్కడి రాష్ట్ర కమిటీ  ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట విడుదల అయిన లేఖలో మాత్రం శాంతి చర్చలకు సానుకూలత వ్యక్తం అవుతున్నందున తాము 6 నెలల పాటు కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించడం ఏంటన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ పేరిట నకిలీ లేఖలు, ప్రకటనలు విడుదల అవుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ నిర్ణయంపై వచ్చిన లేఖపై క్లారిటీ రావల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలయితే వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page