ఇద్దరి వాంగ్మూలం సేకరణ
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కల్వచర్ల సమీపంలో హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసులో సీబీఐ సాక్షులను విచారించడం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు వామన్ రావు కుటుంబ సభ్యుల నుండి మాత్రమే వివరాలను సేకరించిన సీబీఐ హత్య జరిగిన స్థలాన్ని, మంథని కోర్టు ప్రాంగణాన్ని, గుంజపడుగలోని ఆయన నివాసాన్ని సందర్శించింది. అయితే ఈ కేసులో విభిన్న కోణాల్లో ఆరా తీయాలని సీబీఐ అధికారుల బృందం నిర్ణయించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. వామన్ రావుతో సాన్నిహిత్యంగా మెదిలిన వారితో పాటు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన వారి వాంగ్మూలాలు తీసుకునే పనిలో నిమగ్నం అయింది. పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్, మంథని పట్టణ మాజీ ఉప సర్పంచ్, హై కోర్టు అడ్వకేట్ ఇనుముల సతీష్ లను విచారించారు. మంగళవారం సాయంత్రం వీరికి నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు బుధవారం విచారణకు రావాలని సూచించారు. వీరిద్దరిని వేర్వేరుగా రామగుండం కమిషనరేట్ లో సీబీఐ విచారణ బృందానికి ప్రత్యేకంగా కెటాయించిన కార్యాలయంలో విచారించారు. గట్టు వామన్ రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం, హత్యకు ముందు, తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి బొల్లంపల్లి సంతోష్ ను అడిగినట్టుగా సమాచారం.
రూ. 900 కోట్ల గురించి…
మంథని మాజీ ఉప సర్పంచ్, హైకోర్టు అడ్వకేట్ ఇనుముల సతీష్ నుండి వాంగ్మూలం తీసుకున్నారు. రూ. 900 కోట్లకు సంబంధించి ఫిర్యాదు చేసిన అంశంతో పాటు పివి నాగమణి ద్వారా వేసిన కేసుల గురించి కూడా సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నారని సతీష్ తెలిపారు. గతంలో తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీబీఐ అధికారులు మాత్రం అదే విషయం గురించి అడిగడం కొత్తకోణాన్ని ఆవిష్కరించినట్టయిందన్నారు. వామన్ రావు దంపతుల హత్యకు ఆరు నెలలకు ముందు జరిగిన పరిణామాలు, వామన్ రావు బాధితు సంఘం పేరిట ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపు గురించి కూడా తనను అడిగారని వివరించారు. తాను హైకోర్టులో వేసిన పిల్ పిటిషన్ల గురించి కూడా సీబీఐ అధికారులు సమగ్రంగా అడిగారన్నారు. సంతోష్, సతీష్ లను దాదాపు మూడు గంటల పాటు విచారించినట్టుగా తెలిసింది.

