వామన్ రావు దంపతుల హత్య కేసు… రంగంలోకి సీబీఐ ఎంట్రీ…

దిశ దశ, రామగుండం:

సంచలనం సృష్టించిన హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల జంట హత్య కేసులో సీబీఐ విచారణ కోసం రంగంలోకి దిగింది. 2021 ఫిబ్రవరి 17న రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురైన ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగలేదని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దర్యాప్తు బాధ్యతలను సుప్రీంకోర్టుకు అప్పగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారుల బృందం రామగుండం కమిషనరేట్ కు చేరుకుంది. ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న సీబీఐ అధికారులు కేసు పూర్వాపరాలను పరిశీలించినట్టుగా సమాచారం. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ, ఛార్జిషీట్లను స్టడీ చేసిన సీబీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభించినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా గురువారం హత్య జరిగిన కల్వచర్ల ప్రాంతాన్ని పరిశీలించిన సీబీఐ అధికారుల బృందం గుంజపడుగలోని వామన్ రావు ఇంటికి కూడా వెళ్లింది. ఆయన తండ్రి గట్టు కిషన్ రావు నుండి హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ కేసు విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులతో పాటు అరెస్ట్ అయిన వారిని కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. నిజంగానే ఈ జంట హత్యలు కుట్ర కోణంలో జరిగాయా..? అరెస్ట్ అయిన నిందితులు కాకుండా ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్టుగా తెలుస్తోంది.