దిశ దశ, హుజురాబాద్:
జిల్లాలోని ఇసుక రీచుల్లో నిబంధనలు పాటించాల్సిందేనని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు ఇసుక రీచుతో పాటు మామిడాలపల్లి, పచ్చునూరులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… టీజీఎండీసీ సిబ్బంది రీచుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇసుక రవాణాలో అక్రమాలకు తావివ్వకుండా వ్యవహరించాలని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. రీచుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, రీచుల వద్దకు వచ్చివెల్లే లారీల పూర్తి వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. రికార్డుల్లో తేడాలున్నట్టయితే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్, సీపీలు స్పష్టం చేశారు. ఇసుక లోడింగ్ విషయంలో తేడాలు వచ్చినట్టయితే కేసులు నమోదు చేస్తామని, మామిడాలపల్లి, పచ్చునూరు చెక్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా అన్ని రికార్డులు మెయింటెన్ చేయాలని ఆదేశించారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, హుజురాబాద్ ఏసిపి మాధవి, వీణవంక మానకొండూరు తహసీల్దార్లు అనుపమ, విజయ్, టీజీఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

