దిశ దశ, కరీంనగర్:
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదేనేమో. తాను తీసుకుంటున్న మామూళ్ల గుట్టు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినా ఏసీబీ నిఘా కళ్లు అతన్ని వెంబడించి మరీ పట్టుకున్నాయి. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ వర్క్స్, అకౌంట్స్ (WA) జాయింట్ డైరక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ఈగల మధుసూధన్ శాఖాపరంగా అందించాల్సిన సేవల కోసం మామూళ్లు తీసుకుంటున్నాడని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. లంచం తీసుకునేందుకు భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాను ఉపయోగించుకున్నాడని గుర్తించారు. 2022 సెప్టెంబర్ 15 నుండి 2023 సెప్టెంబర్ 20 వరకు రూ. 14,77,003 నగదు లావాదేవీలు జరిగినట్టుగా ఏసీబీ అధికారులు తేల్చారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ద్వారా లంచం తీసుకునేందుకు సదరు అకౌంట్ కు యూపీఐ ద్వారా బదిలీ చేయించుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. పెండింగ్ లో ఉన్న ఫైళ్లను స్క్రూటినీ చేసి, అప్రూవల్ చేసేందుకు ఆయన లంచం తీసుకున్నట్టుగా తేల్చారు. మధుసూధన్ ను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

