నీ దగ్గర డబ్బుంటే ఎమ్మెల్యేగా ఎలా ఓడిపోయావ్..?

నిజామాబాద్ ఎంపీని ప్రశ్నించిన కార్యకర్త…

సోషల్ మీడియాలో వైరల్

దిశ దశ, జగిత్యాల:

డబ్బులున్న వారే రాజకీయాల్లో రాణిస్తారంటూ బీజేపీ సీనియర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంత డబ్బు ఉండి కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని బీజేపీ కార్యకర్త దేశెట్టి కిరణ్ ప్రశ్నించారు. కోరుట్ల నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, నాయకుల చేరికలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ కిరణ్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరవింద్ గెలుపు కోసం కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వారి మాట వినలేని పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటి వరకు ఉన్న నాయకులను కాదని కొత్తవారిని పార్టీలో చేర్పించుకున్నారని వీరిలో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారో అర్థం కావడం లేదని కిరణ్ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుతున్నారా లేక తగ్గిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదని మొదట జెన్ వెంకట్ ను, ఆ తరువాత సురభి నవీన్ రావును, అంతకు ముందున్న రఘు పార్టీని బలోపేతం చేశారని, ఆయన్ను పక్కన పెట్టి వేరే వారిని ప్రోత్సహించారని, తిరిగి రఘుకు ప్రాధాన్యత కల్పించి ఇప్పుడు డాక్టర్ అనూప్ ను పార్టీలో చేర్పించుకున్నారన్నారు. ఇంతమందిని పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఎవరికి ఇస్తారు..? ఎవరికీ ఇవ్వకుండా పార్టీని అణగదొక్కి మీ చేతుల్లోనే ఉండాలనుకుంటున్నారా..? కనీసం కార్యకర్తల అండగా లేనటువంటి పరిస్థితి కోరుట్లలో నెలకొందని, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని, మీ వద్దకు వద్దామంటే మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని, ఓట్లు వేసింది తాము కాబట్టి కాళ్లు మొక్కింది మేము కాబట్టి మీకు మా బాధ అర్థం కాదని, సమస్య చెప్పుకుందామన్న మీకు వినే ఓపిక లేదని దేశెట్టి కిరణ్ వ్యాఖ్యానించారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప ఎంపీ చేసిందేమీ లేదని, ఏ ఊర్లో శంకుస్తాపనలు చేశారు..? ఏ గ్రామానికి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ది చేశారో చెప్పాలన్నారు. నరేంద్ర మోదీ ఎన్నో నిధులు ఇస్తున్నారని, ఆయన మొఖం చూసే ప్రజలు ఓట్లు వేశారు తప్ప మీవల్ల కాదని, 95 శాతం మంది మోదీ చరిష్మా అని 5 శాతం మాత్రమే మీదేనని అన్నారు. అరవింద్ చేతిలో ఉంటే సానుకూల ఫలితం రాదని, మునిసిపల్ ఎన్నికల్లో 40 ఏళ్లు జెండా మోసినోళ్లం… మీరు మొన్న వచ్చిన వాల్లు మీకేం తెలుస్తుందో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పిన మీరు ఎందుకు పోటీ చేశారని, ఇక్కడి నాయకులకు అవకాశం ఇస్తే బావుండేది కదా అని కిరణ్ అభిప్రాయపడ్డారు. కార్యకర్త కష్టం మీకు అర్థం కావడం లేదని బాధ చెప్పుకునేందుకు వస్తే చిన్న చిన్న సమస్యలు తన వద్దకు తీసుకరావద్దని ఎంపీ అరవింద్ అంటున్నారని, అయితే మర్డర్ చేసి మీ వద్దకు రావల్సి ఉంటుందా అని ప్రశ్నించారు. మాకు ఎధురయ్యే సమస్యలు చిన్న చిన్నవని పోలీస్ స్టేషన్లు, తహసీల్ ఆఫీసుల్లో అవసరాలు ఉంటాయని వాటిని పరిష్కరించుకునేందుకు ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు. కార్నర్ మీటింగులు పెట్టడం వల్ల ఎంతమంది గెలిచారో చెప్పాలని, మీ కోసం ఎంతో కష్ట పడ్డామని జైలుకు వెల్లామని రూ. 1.50 లక్షలు ఖర్చాయ్యాయని ఈ విషయం చెప్పుకునే ప్రయత్నించినా పట్టించుకోని పరిస్థితులో ఉన్నారని, ఇవన్ని అంటున్నందుకు నన్ను సస్పెండ్ చేస్తానన్నా కూడా బీజేపీకే ఓటు వేస్తానని కిరణ్ స్ఫష్టం చేశారు. ఇక నుండైనా కార్యకర్తను పట్టించుకునే దిశగా ముందుకు సాగాలని, రఘు 10 మందిని గెలిపించారని, రాయికల్ లో కూడా మాజీ ఛైర్ పర్సన్ గెలిపించుకున్నారని, అయితే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే, పసుపు బోర్డు ఛైర్మన్ ఉన్నా కైవసం చేసుకోలేకపోయారన్నారు. మెట్ పల్లి మునిసిపాలిటీలో జెండా ఎగురవేసే అవకాశం ఉన్నఎంపీ వల్లే పొగొట్టుకున్నామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో కుమ్మక్కై మీరు చేస్తున్నారు కావచ్చు కానీ తాము మాత్రం చేయడం లేదని ఇక్కడి వారంతా నిక్కచ్చిగా ఉన్నారని దేశెట్టి కిరణ్ వెల్లడించారు. కోరుట్ల బీజేపీ నాయకులే ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.