ధిక్కరిస్తే వేటే… రెబెల్స్ కు వార్నింగ్…

బీజేపీ స్టేట్ చీఫ్ స్పష్టం…

దిశ దశ, కరీంనగర్:

భారతీయ జనతా పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుండి తప్పించే  పనిలో నిమగ్నం అయింది. మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రత్యేకంగా సర్వేలు చేయించింది. అయితే నామినేషన్లు వేసిన అభ్యర్థులు టికెట్లు ఆశించి భంగపాటుకు గురై రెబెల్స్ గా బరిలో నిలిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేరిట విడుదల అయిన ఈ ప్రకటన పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై వేటు వేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపులో భాగస్వాములై వారిని గెలిపించాలని, పార్టీ తరుపున నామినేషన్లు వేసిన అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకోవాలని స్పష్టం చేశారు. రెబెల్ గా పోటీ చేసిన వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని 15 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పార్టీ అభివృద్దికి కృషి చేసిన వారికి, టికెట్లు రాని వారికి పార్టీ పరంగా ఆలోచించి ప్రాధాన్యత ఇస్తామని, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఫారం ఇచ్చిన వారు మాత్రమే పోటీలో ఉండాలన్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా సామాజిక పరమైన అంశాలు, గెలిచే అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఖరారు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ది కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామని, మునిసిపల్ ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఫారం రాని అభ్యర్థులంతా వెంటనే తమ నామినేషన్లను ఉప సంహరించుకుని పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. తిరుగుబాటు అభ్యర్థులను పదిహేనేళ్ల పాటు పార్టీ సస్పెండ్ చేస్తామని భవిష్యత్తులో వారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.