Telangana Bjp: తెలంగాణ పరిణామాలపై ఢిల్లీ పెద్దల నజర్…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర పరిణామాలపై ఢిల్లీ పెద్దలు దృష్టి సారించారు. రాష్ట్ర నాయకత్వాన్ని నివేదిక కోరిన జాతీయ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు సమావేశం కావడం, ఈ సమావేశంలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలేం జరుగుతోందని తెలుసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.

రాష్ట్ర పార్టీ ద్వారా…

ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కారణాలు ఏంటీ..? హుజురాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ..? ఇందుకు రాష్ట్ర పార్టీ బాధ్యులు తీసుకున్న చొరవ తదితర అంశాల గురించి సమగ్రంగా నివేదిక ఇవ్వాలని జాతీయ నాయకత్వ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు సూచించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణాలో నెలకొన్న పరిణామాలపై ఢిల్లీలోని పార్టీ ముఖ్యనేతలను కలిసి ఆయన ఈ రోజు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్ ప్రాంత నాయకులు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుల వ్యవహారం, శామీర్ పేటలోని ఈటల నివాసంలో జరిగిన పరిణామాలు ఆయన ప్రసంగాల లొగుట్టుపై కూడా జాతీయ పార్టీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని ద్వారా అడిగి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాత్ర ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? వీరిద్దరి మధ్య అంతరం ఏర్పడడానికి కారణమేంటీ అన్న విషయాలు కూడా జాతీయ పార్టీ ముఖ్య నాయకులు తెలుసుకోనున్నట్టు సమాచారం.

ఈటలకు పిలుపు..?

అయితే ఈటల రాజేందర్ ఇంటి వద్ద జరిగిన సమావేశంపై నిఘా వర్గాలు ఎప్పికప్పుడు నివేదికలు బీజేపీ జాతీయ నాయకులకు చేరినట్టుగా తెలుస్తోంది. సమావేశానికి హాజరైన క్యాడర్ అభిమతం, ఈటల చేసిన ప్రసంగం గురించి కూడా నివేదికలే డిల్లీకి చేరినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన అధికారులు శామీర్ పేట పరిణామాలకు సంబంధించిన అంశాల రిపోర్టును పరిశీలించిన జాతీయ పార్టీ నాయకులు అదే రోజున ఎంపీ ఈటల రాజేందర్ ను ఢిల్లీకి రావాలని పిలిచినట్టుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈటల రాజేందర్ కూడా ఢిల్లీకి వెల్లి ముఖ్య నాయకులను కలిసి జరిగిన విషయాలు వెల్లడించేందుకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యవహారాలను పరిశీలిస్తున్న సునీల్ బన్సల్ ద్వారా కూడా మరో నివేదిక తెప్పించుకున్నట్టుగా సమాచారం. నివేదికలన్నింటిని క్రోడీకరించుకుని జాతీయ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన విబేధాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

చిలికి చిలికి…

అయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ మండల పార్టీ బాధ్యతల విషయంలో మొదలైన ఈ అంశం ఒక్కసారిగా భగ్గుమన్నట్టుగా మారింది. పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంలోనే తమను పట్టించుకోవడం లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటల సన్నిహితులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై స్పష్టమైన హామీ తీసుకునేందుకు శామీర్ పేటకు వెల్లిన వారంతా ఈటలను హుజురాబాద్ లో ప్రత్యేకంగా ఆఫీసులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ఆయన సమ్మతించడంతో పాటు ఘాటుగా స్పందించడం, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన తీరు ప్రధాన చర్చకు దారి తీసింది. అయితే ఇటీవల కాలంలో మల్కాజ్ గిరి ఎంపీగా ఆ ప్రాంతానికే పరిమితం కావడంతో ఈటలతో పాటు బీజేపీలోకి వచ్చిన క్యాడర్ అంతా కూడా తమకు అండగా నిలిచే నాయకుడు లేకుండా పోయాడని అంతర్మథనంలో పడిపోయింది. జాతీయ నాయకత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నదే ప్రధాన చర్చగా సాగుతోంది.