బీజేపీని వీడిన అభ్యర్థి…
దిశ దశ, కరీంనగర్:
సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి పార్టీ టికెట్లు ఇస్తున్నామని, అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్టయితే 15 పాళ్ల పాటు సస్పెండ్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ప్రకటించిన గంటల వ్యవధిలోనే సమీకరణాలు మారిపోతున్నాయి. రెబెల్స్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే క్రమ శిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించిన కొద్దిసేపట్లోనే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అయితే టికెట్ కోసం ఆశించి భంగపడ్డ అభ్యర్థులు వెనక్కి తగ్గుతారని బావించినప్పటికీ కొంతమంది అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 56వ డివిజన్ నుండి బీజేపీ టికెట్ ఆశించిన దుర్శెట్టి అనూప్ కుమార్ సోమవారం రాత్రి బీజీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో గులాభి కండువా కప్పుకున్న అనూప్ తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజనేతరులకు టికెట్ ఇచ్చి స్థానికుడినైన తనను విస్మరించారని, బీజేపీలో ఉన్న యువత వారి భవిష్యత్తు ఏంటో ఆలోచించుకువాలని సూచించారు. సెంట్రలో జోన్ అధ్యక్షునిగా, కార్పొరేటర్ గా పని చేసిన తన విషయంలో బీజేపీ నాయకత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.

