జీవ శాస్త్ర పరిశోధనల్లో బయోవరం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్

కణ, అవయవ పునరుత్పత్తి చికిత్స

ఏఐ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలపై దృష్టి

గ్లోబల్ సమ్మిట్-2025లో కుదిరిన ఒప్పందం

రూ. 250 కోట్ల పెట్టుబడులు

దిశ దశ హైదరాబాద్:

“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్”లో హైదరాబాద్ కు చెందిన అంకుర సంస్థ ‘బయోవరం’ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జీవ శాస్త్ర రంగంలో టిష్యూ ఇంజినీరింగ్, రిజెనరేటివ్ మెడిసిన్, ఏఐ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలు, కణ, జన్యు చికిత్స లకు సంబంధించి ఒక అత్యాధునిక “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ఏర్పాటు కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. భారత బయోటెక్నాలజీ రంగంలో అతి పెద్ద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలవనుంది ఈ ఒప్పందం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు బయోవరం రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది. నవ్యావిష్కరణల్లో భారత దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న విజన్-2047కు అనుగుణంగా ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఉంటాయి. టిష్యూ ఇంజినీరింగ్, ఆధునిక బయోమెటీరియల్స్, కణ-అవయవ పునరుత్పత్తి చికిత్స(రీజనరేటివ్ మెడిసన్) ,కణ-జన్యు చికిత్స (సీజీటీ) ఏఐ-ఆధారిత బయో ఎనలిటిక్స్, ప్రిడిక్టివ్ ప్లాట్‌ఫామ్స్ వంటి కీలక రంగాల్లో అభివృద్ధి జరగనుంది. ఈ కేంద్రం ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాంతీయ నవ్యావిష్కరణల ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. మొదటి దశలోనే రీజనరేటివ్ బయాలజీ, ఏఐ, బయో మెటీరియల్స్, సీజీటీ రంగాల్లో 50 మంది ప్రపంచస్థాయి శాస్ర్తవేత్తలు పని చేయనున్నారు. సైంటిఫిక్, ఇంజినీరింగ్, రెగ్యులేటరీ, ఆపరేషనల్ రంగాల్లో 200 ఉద్యోగావకాశాలు అందించే అవకాశం ఉంది. నిర్మాణం, లాజిస్టిక్స్, సప్లై చైన్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో 500 మందికి పరోక్ష ఉపాధి లభించనుంది.
తెలంగాణ రాష్ట్రంలో సైన్స్ మౌలిక సదుపాయాలను పెంచడం, భారతదేశాన్ని బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ సెంటర్‌ను జాతీయ-అంతర్జాతీయ నవ్యావిష్కరణల వేదికగా తీర్చిదిద్దేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం “భారత్ ఫ్యూచర్ సిటీ”లో భూమి కేటాయించడంతో పాటు, భవన నిర్మాణం-కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంది.
శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (బయోవరం చైర్మన్, మార్గదర్శి), బయోవరం వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డా. జగన్మోహాన్ రెడ్డి చొరవతో ఈ ఎక్సలెన్స్ కేంద్రం కార్యరూపం దాల్చనుంది. 

“భారతదేశం నవ్యావిష్కరణల్లో అగ్రగామిగా ప్రపంచాన్ని నడిపించాలని, తెలంగాణ రాష్ట్రం భారతదేశాన్ని నడిపించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. ప్రభుత్వం-పరిశ్రమ-శాస్త్రవేత్తల మధ్య దార్శనిక సహకారం ఉంటే ఏం సాధించగలమో బయోవరం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక సాక్ష్యం.”
-కె.వరప్రసాద్ రెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు

“ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి, తెలంగాణ ప్రభుత్వం అందించిన మద్దతుతో 2047 నాటికి రిజనరేటివ్ మెడిసిన్, ఏఐ-ఆధారిత బయోటెక్నాలజీలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయి పోటీదారుగా నిలపడానికి బయోవరం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది.”
డాక్టర్ కె.జగన్మోహన్ రెడ్డి, బయోవరం ఎండీ.