గేమింగ్ యాక్టులో చెన్నూరు కాంగ్రెస్ నాయకులు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పోలీసులు జూదం కేంద్రంపై దాడి చేశారు. రేకుర్తిలోని ఓ ఇంట్లో పేకాట అడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 13 మందిని పట్టుకున్నారు. వీరి నుండి రూ. 3,65,760 నగదు స్వాధీనం చేసుకోగా, 14 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఏఎస్ఐ ఎం పోచయ్యలు పోలీసుల బృందంతో పేకాట ఆడుతున్న ఇంట్లో సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. తీన్ పత్తా గేమ్ అడుతున్న వీరిపై గేమింగ్ యాక్టు చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. ముత్యాల తిరుపతి సల్లూరి నర్సయ్య గోనె సాగర్ రావు తాళ్లపల్లి తిరుపతి కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రెక్కుల శ్రీనివాస్ నందలి అన్వేష్ వాళ్ల కిషోర్ కుమార్ వావిలాల వేణుగోపాల ప్రసాద్ కొండపాక శ్రీధర్ కొండ దేవయ్య ముసక ఉపేందర్, బొట్టు రవీందర్ లకు నోటీసులు ఇచ్చి పంపించినట్టు సీఐ వెల్లడించారు.

చెన్నూరు నాయకులు…

బుధవారం కరీంనగర్ రూరల్ సర్కిల్ పోలీసులు పట్టుకున్న జూదగాళ్లలో చెన్నూరు ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకునికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి నాయకుడు కూడా ఉన్నట్టుగా సమాచారం. చెన్నూరు సెగ్మెంట్ లోని జైపూర్ మండలంలో పార్టీ వ్మవహారాలను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు కూడా గేమింగ్ యాక్టులో దొరకడం కలకలం సృష్టిస్తోంది. అయితే పోలీసులు తీసిన ఫోటోలో ఆయన స్పష్టంగా కనిపించకపోవడంతో సకాలంలో వెలుగులోకి రాలేదు. గురువారం మీడియాలో వచ్చిన కథనాల్లో పోలీసులు పట్టుకున్న వారి పేర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరు ఉండడం చర్చనీయాంశంగా మారింది. వీరిలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

అడ్డాలు మారాయా..?

గతంలో చెన్నూరు శివార్లలోని తోటలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా జూదం ఆడేవారు. అలాగే పొరుగునే ఉన్న మహారాష్ట్రంలోని సిరొంచ తాలుకాలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన క్లబ్బుల్లో కూడా పేకాట ఆడేందుకు క్యూ కట్టేవారు. గడ్చిరోలి ఎస్పీ పేకాట క్లబ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో అక్కడ జూదం ఆటకు బ్రేకులు పడ్డాయి. మరో వైపున రాజూరతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పేకాట దర్జాగా నడుస్తున్నప్పటికీ దూరభారం ఎక్కువ కావడంతో పేకాట రాయుళ్లు అడ్డాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూదగాళ్లు ప్రత్యమ్నాయ అడ్డాలు చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా రేకుర్తిలో పోలీసులు జూదగాళ్లను పట్టుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పేకాట అడ్డాలపై ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page