సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వస్తున్నారా..?

చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయిక్కడ…

దిశ దశ, కాళేశ్వరం:

దేశంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో ఉండే నదికి ఈ నెల 15 నుండి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ముందుగానే రూట్ మ్యాప్ చేసుకుంటే మరిన్ని సందర్శనీయ స్థలాలను చూసే అవకాశం ఉంటుంది. పర్యాటక ప్రాంతాలతో పాటు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న త్రివేణి సంగమ క్షేత్రం పరిసర ప్రాంతాల గురించి ముందుగానే తెలుసుకుని వెళ్లండి.

కాళేశ్వరం… 

త్రివేణి సంగమం, త్రిలింగ క్షేత్రం, త్రి దైవ క్షేత్రంగా భాసిల్తుతున్న కాళేశ్వరంలో మాత్రమే సరస్వతి నది పుష్కరాలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేపాల్ పశుపాథ స్వామి, కాశీ విశ్వేశ్వర ఆలయాల సరసన నిలుస్తున్న చరిత కాళేశ్వరం సొంతం.

చూడదగ్గ ప్రాంతాలు…

మంచిర్యాల జిల్లా చెన్నూరుకు దిగువున కాళేశ్వరానికి ఎగువన గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. పశ్చిమం నుండి తూర్పు వైపునకు ప్రవహించే నదులు, తూర్పు వైపు నుండి పశ్చిమం వైపునకు ప్రవహించే నదాలు దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అయితే గోదావరి నది మాత్రం నేరుగా తూర్పు వైపునకు కాకుండా ఉత్తర వైపునకు మళ్లడమే ఇక్కడి స్పెషాలిటీ. ఈ కారణంగానే ఉత్తర వాహినిగా ఈ ప్రాంతం ప్రాశస్త్యం పొందింది. మరో వైపున ఒడిషాలోని పూరీలో వెలిసిన జగన్నాథ స్వామి ఆలయమే ప్రపంచానికి తెలుసు. కానీ చెన్నూరు పట్టణంలో జగన్నథ స్వామి ఆలయం ఉండడం మరో విశేషం. అలాగే శతబ్దాల చరిత కలిగిన చెన్నూరు పట్టణంలో అత్యంత పురాతనమైన శివాలయం కూడా ఉంది. చెన్నూరేు సమీపంలోని వేమనపల్లి శివార్లలోని నది తీరంలో రాకాసి గూళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ డైనోసార్ అవశేషాలు లభ్యం కావడంతో ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. చెన్నూరు నుండి ప్రాణహిత నదికి వెల్తున్న మార్గ మధ్యలో పారుపల్లి గ్రామంలో గుట్టపై కాల భైరవుని మందిరం భక్తుల పూజలందుకుంటోంది. కాళేశ్వరానికి ఉత్తరం వైపున, చెన్నూరుకు దిగువ భాగాన ఉన్న మహారాష్ట్రంలోని సిరొంచ కూడా అత్యంత చరిత్రను సంతరించుకుంది. 1890లో బ్రిటీష్ పాలకులు ఎగువ గోదావరి (Upper Godavari District) జిల్లాగా ఇక్కడి నుండి పరిపాలన కొనసాగించారు. అప్పటి బ్రిటీష్ అధికారులు దీనిని ఆ కాలంలో అద్దాలతో నిర్మించడంతో ఈ ప్రాంత వాసులు దీనిని అద్దాల బంగ్లా అని పిలిచేవారు. ప్రస్తుతం మహారాష్ట్ర పిడబ్లూడి (PWD) పర్యవేక్షణలో ఉన్న ఈ రెస్ట్ హౌజ్ ను అప్పటి బ్రిటీష్ కలెక్టర్ గ్లాస్ ఫోర్డ్ నిర్మాణం చేయించారు. ప్రాణహిత నది ఒడ్డున ఉన్న ఈ భవనం నేటికీ చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం. అలాగే సిరొంచలోని ప్రాణహిత నది తీరంలో విఠలేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా శతాబ్దాల క్రితమే వెలిసింది కావడం విశేషం.

ఫాసిల్ పార్క్…

సిరొంచ నుండి ఆసరెల్లికి వెల్లే దారిలో వడిదం ఫాజిల్ పార్క్ ను సిరొంచ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ భాగాన దాదాపు పదేళ్ల క్రితం డైనోసార్ అవశేషాలు లభ్యం కావడంతో అప్పటి అటవీ అధికారి వాటిని సేకరించి పరిశోధనలకు పంపించడంతో అవి ‘‘సారాపోడ్’’ అనే శాఖాహర సంతతికి చెందిన డైనోసార్లకు సంబంధించిన అవశేషాలేనని తేల్చారు. డైనోసార్స్ ఫాసిల్స్ అన్నింటిని పరిశోధనల కోసం ఆల్లపల్లి అటవీ శాఖ కార్యాలయానికి పంపించిన అధికారులు వడిదెం శివార్లలో పాసిల్ పార్క్ నిర్మాణం చేశారు. ఈ పార్కులో లక్షల సంవత్సరాల నాటి భారీ వృక్షాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లభ్యం కావడంతో వాటిపై ఉన్న మట్టిని తొలగించి పరిశోధనలు చేయించగా అవి కొన్ని కొట్ట సంవత్సరాల క్రితం నాటివని గుర్తించారు. వీటన్నింటి సమహారంగా వడిదెం ఫాసిల్ పార్కును అటవీ శాఖ నిర్వహిస్తోంది.

మేడిగడ్డ…

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్ హౌజులు కూడా కాళేశ్వరం సమీపంలోనే ఉంటాయి. మేడిగడ్డ మాత్రం దాదాపు 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరిగిన అంబట్ పల్లిలో అతి పురాతనమైన అమరేశ్వరాలయం కూడా ఉంది. కాకతీయుల కాలంలో పూజలందుకున్న ఈ ఆలయంలోని పానవట్టానికి ఓ ప్రత్యేకత ఉంది. అలాగే ఈ ఆలయంలో వెలిసిన అన్నపూర్ణ దేవి విగ్రహం కూడా భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నది. అత్యంత పురాతన కాలం నాటి ఈ ఆలయం నేటికీ పూజలందుకుంటోంది. మహదేవపూర మండల కేంద్రానికి 2.5 కిలో మీటర్ల దూరంలో శ్రీ మందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం కావడం మరో విశేషం. సహజ వనరుల నడుమ వెలిసిన కాళేశ్వరంతో పాటు సమీప ప్రాంతాలన్ని కూడా ఎన్నో చారిత్రాత్మక నేపథ్యాన్ని సంతరించుకున్న ప్రాంతం. కానీ ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంత కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థ అంతగా లేకపోవడంతో ఈ ప్రాంత అరుదైన చరిత వెలుగులోకి రాకుండా పోయింది. సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తులు సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది.

You cannot copy content of this page