మిషనరీ వాడొచ్చా…?
నది లోపలకు లారీలు వెల్లొచ్చా..?
డిసిల్ట్రేషన్ అంటే..?
దిశ దశ, మహదేవపూర్:
అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ఏరియాలో ఇసుక తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. పరిశోధనలకు అనువుగా ఉండేందుకు మేటలు వేసిన ఇసుకను తొలగించాలని ఆయా సంస్థలు ప్రతిపాదించడంతో తమ విభాగంతో పాటు టీజీఎండీసీ యంత్రాంగం పర్యవేక్షణలో ఇసుక తరలిస్తున్నామని ఈఈ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక రవాణా విషయంలో నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఇందుకు అనుగుణంగా ముందుకు సాగినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. బ్యారేజీకి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ఎగువ, దిగువ భాగంలో కూడా ఇసుక మేటలు తొలగిస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ NDSA, CWPRS, Pune సంస్థల నిపుణులు ఇసుక తొలగించాలని చేసిన సూచనల ప్రకారం ఎగువ, దిగువ ప్రాంతంలో ఎంతమేర విస్తీర్ణంలో, ఎంత లోతు వరకు ఇసుక తీయాల్సి ఉంటుందో పేర్కొన్నారా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అదెలా..?
అన్నారం బ్యారేజీలో పేరుకపోయిన ఇసుక తొలగించే విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా అన్నదే అసలు ప్రశ్న. పర్యావరణ నిబంధనల మేరకు ఇసుక రవాణా ప్రక్రియ సాగుతోందా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు CWPRS, Puneకు చెందిన నిపుణులు పరీక్షలు చేయాలంటే అన్నారం బ్యారేజీలో పేరుకపోయిన ఇసుకను తొలగించాల్సిన అవసరం ఉందని ఈఈ రమేష్ బాబు వెల్లడించారు. పేరుక పోయిన ఇసుక తొలగించేందుకు మిషనరీలను ఉపయోగించే విషయంలో నిబంధనల మేరకే నడుచుకుంటున్నారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. మరో వైపున భారీ వాహనాలు నది లోపలి వరకూ తీసుకెళ్లాలని పరిశోధనలకు జరుపుతున్న నిపుణులు సూచించారా లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. NDSA, CWPRS, Pune సంస్థల నుండి ఇసుక తరలించాలని, ఇందుకు భారీ యంత్రాలను, వాహానాలను సైతం బ్యారేజీ సమీపం వరకు అనుమతించవచ్చని సూచించినట్టయితే ఆయా సంస్థలు పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ విభాగం నుండి అనుమతి తీసుకుని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు అనుమతులు ఇచ్చారా లేదా అనేదే అంతు చిక్కకుండా పోంతోంది. బ్యారేజీని పరీక్షించేందుకు ఇసుక మేటలు తొలగించాలని మాత్రమే NDSA, CWPRS, Pune సంస్థలు ప్రతిపాదించినట్టయితే తెలంగాణ నీటిపారుదల విభాగం అధికారులు ఎన్విరాన్ మెంట్ యాక్ట్ కు అనుగుణంగా నడుచుకునేందుకు అనుమతులు తీసుకున్నారా అన్న విషయంపై కూడా స్పష్టత లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బ్యాక్ వాటర్ నిలువ ఉంచకూడదని NDSA గతంలోనే సూచించింది. ఈ క్రమంలో బ్యారేజీల మీదుగా భారీ వాహనాల రాకపోకలు కొనసాగించవద్దని నిర్ణయించిన ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఇప్పుడు NDSA ఇసుక లారీలను ఇసుక మేటలు వేసిన గోదావరి నదిలోకి, బ్యారేజీ వరకూ తీసుకెళ్లాలని సూచించిందా అన్న విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
డిసిల్ట్రేషన్…
అయితే అన్నారం బ్యారేజీలో డిసిల్ట్రేషన్ లో భాగంగానే పేరుకపోయిన ఇసుక తరలిస్తున్నామని ఈఈ రమేష్ బాబు ప్రకటించారు. అయితే డిసిల్ట్రేషన్ పేరిట మానేరు నదిలో చెక్ డ్యాంలను నిర్మించేందుకు ప్రతిపాదించిన ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ విషయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT)ని ఆశ్రయించారు. డిసిల్ట్రేషన్ పేరిట ఇసుకను కమర్షియల్ అవసరాలకు వినియోగించకూడదన్న నిబంధనలు ఉన్నాయని, స్థానిక అవసరాలకే వినియోగించాల్సిన
అవసరం ఉందని, నదిలో ఇసుక తవ్వకాల కోసం యంత్రాలను ఉపయోగించకూడదని కూడా స్ఫష్టంగా పేర్కొన్నారని మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్జీటీ కూడా ఈ వాదనను సమర్థిస్తూ తీర్పును ఇవ్వడం గమనార్హం. ఇవే నిబంధనలు అన్నారం వద్ద చేపట్టిన డిసిల్ట్రేషన్ విషయంలోనూ అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రోడ్డు మరీ..?
మరో వైపున గోదావరి నదిలో ఇసుకను తరలించేందుకు ఆన్నారం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ ఏరియాలో లారీల రాకపోకల కోసం తాత్కాలిక రహదారి కూడా సిద్దమైనట్టుగా స్పష్టం అవుతోంది. ఏ నిబంధనల ప్రకారం రోడ్డు వేసుకున్నారోనన్న విషయంపై కూడా స్థానికంగా తర్జనభర్జనలు సాగుతున్నాయి.

