దిశ దశ, హైదరాబాద్:
చత్తీస్ గడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతిపై విచారణ జరపాలని తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నందున నివృత్తి చేసేందుకు హై కోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలన్నారు. శాంతి చర్చలు జరిపినట్టయితే తాము సుముఖంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించిన నేఫథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేయకుండా ఎన్ కౌంటర్లకు పాల్పడడం సరికాదన్నారు. ప్రాణాలు తీయడం, తలలకు వెల కట్టడం సరైన చర్య కాదని, సైద్దాంతిక పరమైన అంశాలపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని కోదండరాం అభిప్రాయపడ్డారు. శాంతి చర్చల కోసం ముందుకు రావల్సిన అవసరం ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జన సమితి నాయకులు శంకర్ రావు, సర్దార్, రత్నాకర్ రావు, పీక కిరణ్, జయపాల్, చంద్రయ్యలు కూడా ఉన్నారు.
హక్కులు కాల రాయడమే: సీఎల్సీ నేత కుమారస్వామి
చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేరిట ఏరివేత కార్యక్రమంతో బలగాలు ప్రాణాలు తీస్తున్న సరైంది కాదని, జీవించే హక్కును కాలరాయడమేనని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధవ కుమారస్వామి అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ వారీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ… కేంద్ర పారా మిలటరీ బలగాలు, డీఆర్జీ కమెండోలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను సమూలంగా ఏరివేసి విముక్తి భారత్ పేరుతో ఎన్ కౌంటర్లను ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు 525 మందిని ఎన్ కౌంటర్ల పేరిట చంపేయడం ఆందోళన కల్గిస్తోందని అన్నారు. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక రాష్ట్ర కో కన్వీనర్ మార్వాడి సుదర్శన్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న, విరసం జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొంకూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రవి ప్రజా సంఘాల నాయకులు రెడ్డి రాజుల సంపత్, నారా వినోద్, పుల్ల సుచరిత, ఎరుకల రాజన్న, గుమ్మడి కొమురయ్య, పులిపాక రవిందర్, గాండ్ల మల్లేశం, బండారి రాజలింగ్, శ్రీపతి రాజగోపాల్, బండి శంకర్, మంచినీళ్ల లింగన్నలు పాల్గొన్నారు.