దిశ దశ, కరీంనగర్:
కలహాలకు చోటివ్వకుండా, అభిప్రాయ బేధాలకు తావివ్వకుండా విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో కరీంనగర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరైన ఈ సమావేశంలో కరీంనగర్ కార్పోరేషన్, సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మునిసిపాలీటీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిసిపాలిటీల వారిగా నాయకులతో చర్చించిన మంత్రులు తుమ్మల, పొన్నంలు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులందరిని కలుపుకుని పార్టీ కార్యకలాపాలు కొనసాగించాలని, ఈ విషయంలో ఎలాంటి బేషజాల పోకూడదని సూచించారు. పార్టీలో చేరే నాయకుల విషయంలో అయినా, కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాల్లో అయినా అందరూ కలిసికట్టుగా ఉండాల్సిందేనని, ఇంఛార్జీలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ముగ్గురు మంత్రులకు…
కరీంనగర్ కార్పోరేషన్ విషయంలో అధిష్టానం పకడ్భందీ వ్యూహంతోనే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. బల్దియా వ్యవహారాల్లో మంత్రులతో సంబంధం లేకుండానే నిర్ణయాలు జరుగుతాయని, ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేశారని కరీంనగర్ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సూచలు రావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులకు కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి వెల్లడించినట్టుగా సమాచారం. ఒక్కో మంత్రికి 22 డివిజన్ల చొప్పున బాధ్యతలు అప్పగించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్టుగా మంత్రి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. సుడా ఛైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు ఛైర్మన్ కర్ర రాజశేఖర్ లతో పాటు మరికొంత మంది నాయకులు కరీంనగర్ లో జరుగుతున్న పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో సమిష్టిగా ఉండాలని ఇంఛార్జికి సూచించినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ లాంటి బలమైన వ్యక్తులు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పినట్టుగా సమాచారం.
సిరిసిల్ల…
సిరిసిల్లలో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ… పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు ఒకరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సిరిసిల్ల నుండి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల్లో ఉందని సూచించినట్టుగా సమాచారం. కరీంనగర్ జిల్లాలోని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఫలితాలను అందుకోవల్సిన అవసరం ఉందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపై నడవాల్సిందేనని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ,సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,ఆది శ్రీనివాస్, కరీంనగర్, సిద్దిపేట , సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు సత్తు మల్లేష్ , లింగమూర్తి , నాగుల సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు, హుజురాబాద్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ , సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి,కరీంనగర్, సిరిసిల్ల ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, సంగీతం శ్రీనాథ్, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ లు హజరయ్యారు.