దిశ దశ, మహదేవపూర్:
ఇతర ప్రాంతాల్లో ఇసుక తొలగించే విషయంలో నిబంధనలు పాటించే అధికారులు అక్కడి రీచుల నిర్వహణ విషయంలో మినహాయింపు ఇవ్వడానికి కారణమేంటన్నదే మిస్టరీగా మారింది. అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక మేటలు వేసిందన్న కారణంతో ఏర్పాటు చేస్తున్న రీచులపై ప్రత్యేకంగా మమకారం చూపడానికి కారణమేంటన్న చర్చ స్థానికంగా సాగుతోంది.
రూల్స్ బ్రేక్…
అన్నారం రీచుల విషయంలో నిబంధనలు అమలు చేయడంలో పట్టించుకోని వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారన్న విషయంపై స్పష్టత లేకుండా పోతోంది. పేరుకపోయిన ఇసుక తొలగించాలని పరిశోధన సంస్థలు ప్రతిపాదించారు కానీ దానిని తరలించే విషయంలో నిబంధనల సడలింపు ఎందుకిస్తున్నారన్నదే పజిల్ గా మారింది. ఇక్కడ స్టాక్ యార్డు ఏర్పాటు చేసుకోకుండా గోదావరినదిలోనే లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. మరో వైపున ఇసుక కోసం వచ్చిన లారీల కోసం కనీసం పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో వాటిని కెనాల్ మీదుగా ఇతర గ్రామాలకు అనుసంధానం చేస్తూ వేసిన రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. ఓ వైపున కెనాల్, మరో వైపున రోడ్డకు ఓ వైపున లారీలు పార్కింగ్ చేసినా తమకేమీ పట్టనట్టుగా వ్వవహరిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. అలాగే లోడ్ అయిన లారీల్లో ఇసుక లెవలింగ్ చేయడం, టార్పాలెన్స్ కట్టడం కోసం కూడా రోడ్డునే ఉపయోగిస్తున్నారు. ఇసుక నింపిన లారీలు అన్నారం, దామెరకుంట ప్రధాన రహధారిపై పార్క్ చేస్తుండడం గమనార్హం. కెనాల్స్ మీదుగా వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేందుకు వేసిన వంతెనల మీదుగా భారీ వాహనాలను తరుచూ అనుమతించడం సరైందా కాదా అన్నది అధికారులే తేల్చాల్సిన అవసరం ఉంది. అలాగే వంతెనాలపైనే లోడ్ చేసిన లారీలను పార్క్ చేస్తుండడం వల్ల అవి దెబ్బతినే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కూడా స్థానికంగా వ్యక్తం అవుతోంది. అన్నారం బ్యారేజీలో భారీ ఎత్తున ఇసుక నిలువలు పేరుకపోయాయని వాటిని తొలగించాలని పరిశోధన సంస్థ ప్రతినిధులు చెప్పినందున ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే మైనింగ్ నిబంధనల ప్రకారం టీజీఎండీసీ నడచుకుంటోందా..? ఈ మేరకు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారా లేదా అన్న విషయంపై ఇరిగేషన్ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
గత అనుభవాలూ…
అయితే 2023 అక్టోబర్ నెలలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) రంగంలోకి దిగింది. కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలను సునిశితంగా పరిశీలించి ఒకే రకమైన డిజైన్ లో నిర్మించిన మూడు చోట్ల కూడా పరిశోధనలు జరపాలని బ్యాక్ వాటర్ నేరుగా వదిలేయాలని స్పష్టం చేసింది. దీంతో అప్పటి నుండి కూడా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ వద్ద నీటిని నిలువ ఉండచం లేదు అధికారులు. ఈ కారణంగా అన్నారం బ్యారేజీ గేట్ల సమీపంలో భారీగా ఇసుక పేరుకపోయిందని, గేట్లు, వెంట్ల భాగంలో కూడా ఇసుక నిలవ చేరిందని ఇరిగేషన్ అధికారులు గతంలో నివేదికలు సిద్దం చేశారు. అప్పుడు కూడా ఇదే విధంగా ఇసుకను తొలగించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే అప్పటి నుండి కూడా లారీలు అన్నారం వద్ద గోదావరి నదిలోకి తీసుకెళ్లి లోడింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నప్పటి నుండి అన్నారంలో ఇసుక మేటలు వేస్తున్న విషయాన్ని గమనిస్తున్న ఇరిగేషన్ అధికారులు కనీసం బ్యారేజీల పునరుద్దరణ వరకైనా సమీపంలో స్టాక్ యార్డ్, పార్కింగ్ ప్లేస్ వంటివి ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదులు చేయకపోవడం ఏంటో అర్థం కాకుండా పోతోంది. అన్నారం బ్యారేజ్ సమీపంలో నీటి పారుదల శాఖకు చెందిన భూములు ఉన్నా TGMDCకి లీజుకు ఇచ్చినట్టయితే అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలను విస్మరిస్తూ ఇరిగేషన్ అధికారులు కేవలం CWPRS, Pune నిపుణులు చెప్పారు కాబట్టే ఇసుక మేటలు తొలగించేందుకు అనుమతించామని, అక్కడ అక్రమంగా తవ్వకాలు జరగడం లేదని ప్రకనలు చేస్తున్నారు. వాస్తవ విషయాలను పక్కన పెట్టి రూల్స్ బ్రేక్ చేస్తున్న తీరు ఎంతవరకు సమంజమనేది అధికారులకే తెలియాలని స్థానికులు అంటున్నారు. మరో వైపున TGMDC కూడా నిబంధనలు పాటించే విషయంలో కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదోనన్నది కూడా అంతు చిక్కకుండా పొతోంది. అన్ని చోట్ల నిబంధనలు పాటిస్తూ అన్నారం విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. గోదావరి నదిలో హద్దులు నిర్దారించకపోగా, సీసీ కెమరాల ఊసే లేకుండా పోయింది. అలాగే వే బ్రిడ్జిలు కూడా ఇక్కడ కానరవడం లేకపోగా కొన్ని విభాగాల అధికారులు మాత్రం తమ శాఖకు రెవెన్యూ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లారీల నుండి రుసుం వసూలు చేస్తున్నారు.