Telangana Acb: ప్రొబేషనరీ ముగియక ముందే ఏసీబీకి చిక్కి…

అకౌంట్స్ ఆఫీసర్ ట్రాప్ వెనక…?

దిశ దశ, ఆదిలాబాద్:

పట్టు మని పది నెలలు మాత్రమే అయింది ఆయన సర్వీసులోకి వచ్చి…  ప్రొబేషనరీ కూడా పూర్తి కాలేదు… అయినా అతను మాత్రం తన చేతి వాటాన్ని ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. చివరకు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఆ అకౌంట్స్ ఆఫీసర్ డబ్బులు లెక్కించడం మాని ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. గురువారం ఆదిలాబాద్ మునిసిపల్ అకౌంట్స్ ఆఫీసర్ బట్టల రాజ్ కుమార్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఉద్యోగ నేపథ్యం గురించి వెలుగులోకి రావడంతో అంతా నివ్వెరపోతున్నారు.

ఏకైక ఉద్యోగం…

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల కాగా చాలా మంది నిరుద్యోగులు పోటీ పడ్డారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రాజ్ కుమార్ సెలెక్ట్ కాగా అతన్ని ఆదిలాబాద్ మునిసిపల్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించింది. విధుల్లో చేరిన పది నెలల్లోనే రాజ్ కుమార్ ఏసీబీకి ట్రాప్ కావడం సంచలనంగా మారింది. ఉద్యోగం లేక నిరుద్యోగులు అల్లాడిపోతుంటే… రాజ్ కుమార్ మాత్రం ఉద్యోగంలో చేరి చేరగానే తన చేతివాటాన్ని ప్రదర్శించిన తీరు సంచలనంగా మారింది. ప్రొబేషనరీ కాలం కూడా గడవకముందే ఆయన పర్సెంటేజీల కోసం పాకులడడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. బిల్లు మంజూరు చేయాలంటే 10 నుండి 20 శాతం వరకూ పర్సెంటేజీ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పేవాడని బల్దియా కాంట్రాక్టర్లు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. గతంలో చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్థిక భారంలో కూరుకపోయిన తమను వేధిస్తున్న తీరును తట్టుకోలేకపోయిన ఓ కాంట్రాక్టర్ చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి రెడ్ హైండెడ్ గా పట్టించారు. ప్రొబేషనరీ కాలం కూడా గడవక ముందే పర్సంటేజీల కోసం పాకులాడడంతో లంచం తీసుకుంటుండగా అతన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో అతని ఉద్యోగం ఉంటుందా లేదా అన్న చర్చ కూడా మొదలైంది. ఏసీబీ ట్రాప్ కేసుల్లో శాఖాపరంగా కూడా విచారణ చేపట్టే విధానం అమల్లో ఉంటుంది. రాజ్ కుమార్ పై కూడా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం శాఖపరంగా విచారణ జరిపి అతని ప్రవర్తన సరిగా లేదని నిర్దారించినట్టయితే ఉద్యోగం నుండి తొలగించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఏసీబీ ట్రాప్ కేసు నేపథ్యంలో మొదట సస్పెన్షన్ చేసే అధికారులు ఆ తరువాత శాఖాపరంగా విచారణ చేయనున్నారని తెలుస్తోంది. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ చేసే అధికారులు అతన్ని డిస్మిస్ చేయాలని నిర్ణయిస్తే ఇక ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హుడు కాడని తెలుస్తోంది. ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలోనే లంచానికి కక్కుర్తిపడ్డ రాజ్ కుమార్ భవితవ్యం ఎలా ఉండబోతోందోనన్న చర్చ మునిసిపల్ విభాగంలో సాగుతోంది.

సంబరాలు…

ఆదిలాబాద్ అకౌంట్స్ ఆఫీసర్ ఏసీబీ ట్రాప్ తరువాత బల్దియా కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్ తీరుపై విసుగు చెందిన కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తున్న ఆనందం అంతా ఇంతా కాదు.

ACB RAIDSACB TELANGANAadilabad newsTELANGANA ACBtelangana news