ఆయన మరణానికి ముందు… తరువాత..?

బసవరాజ్ ఎన్ కౌంటర్ కు ముందు ఏం జరిగింది..?

దిశ దశ, దండకారణ్యం:

మే 21కి ముందు అసలేం జరిగింది..? మావోయిస్టు పార్టీ అగ్రనేతల మధ్య జరిగిన చర్చల సారాంశం ఏమిటీ..? సాయుధ పోరు విరమణకు మొగ్గు చూపారా..? ప్రజా క్షేత్రంలోకి వెళ్లి చైతన్య తీసుకురావాలని నిర్ణయించారా..? అడవుల్లోనే కొనసాగుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించాలనుకున్నారా..? బలగాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకున్నారా..? అప్పుడేం జరిగింది..? ఇప్పుడు ఏం నడుస్తోంది అన్నదే అంతు చిక్కకుండా పోయింది. డాక్యూమెంట్ ఆధారాలు ఏవీ లేనప్పటికీ అజ్ఞాతంలో ఉన్న వారి ప్రకటనలకు… జన జీవనంలోకి వచ్చిన వారు చెప్తున్న అంశాలకు పొంతన లేకుండా పోతోంది.

అంతా అప్పుడే…

మావోయిస్టు పార్టీ విప్లవోద్యమ చరిత్రలో భారీ కుదుపు మాత్రం ఈ ఏడాది నుండి తీవ్రంగా మొదలైంది. సాయుధ పోరాట చరిత్రలోనే కేంద్ర కమిటీ కార్యదర్శి, సభ్యులు వరస ఎన్ కౌంటర్లలో హతం కావడం సంచలనంగా మారింది. మే 21న చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో బసవరాజ్ మరణం తరువాత పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను ప్రత్యక్ష్యంగా చూపించినట్టయింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పార్టీకి చెందిన కీలక నేత మల్లోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి అలియాస్ అభయ్, 61 మంది సాయుధ నక్సల్స్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు ఆయుధ విరమణ ప్రకటించారు. మరో రెండు రోజులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆశన్న దాదాపు 208తో కలిసి చత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయుధాలను త్యజించారు. వీరు జనజవనంలోకి వచ్చిన తరువాత మావోయిస్టు పార్టీ అభయ్ పేరిట విడుదలైన ప్రకటనలో వీరిని విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.

ఆయుధ విరమణ…

అయితే బాహ్య ప్రపచంలోకి వచ్చిన అగ్రనేతల నుండి వెలువడుతున్న ప్రకటనల సారాంశాన్ని బట్టి కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ ఎన్ కౌంటర్ కు ముందే ఆయుధ విరమణ అంశంపై నిర్ణయం జరిగిందని స్పష్టం అవుతోంది. 2024 నవంబర్ నెలలో జరిగిన చర్చల్లో శాంతి చర్చల ప్రతిపాదనతో ముందుకు వెళ్లాలా లేక సాయుధ పోరు విరమణ ప్రకటన చేయాలా అన్న అంశం తర్జనభర్జనలు సాగాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్లోజ్జుల వేణుగోపాల్ రావును ఇతర ప్రాంతాలకు పంపించిన కొంతకాలానికి 2025 మార్చి, ఎప్రిల్ నెలల్లో తిరిగి సమావేశం అయినప్పుడు బసవరాజ్ తో పాటు కీలక నేతలంతా ఆయుధాలను త్యజించేందుకే సానుకూలత వ్యక్తం చేశారని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆశన్న విడుదల చేసిన వీడియోలో కూడా బసవరాజ్ ఎన్ కౌంటర్ కు ముందే ఆయుధ విరమణ చేయాలన్న నిర్ణయం జరిగిందని వెల్లడించారు. తమను విప్లవ ద్రోహులుగా ప్రచారం చేస్తున్న కొంతమంది తమ శవాలపై ఎర్ర జెండా కప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దండకారణ్యంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను గమనించే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు.

అలాంటిదేమీ లేదు…

అయితే మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రచారాన్ని తప్పు పడుతున్నారు. సాయుధ పోరుతోనే ముందుకు సాగాలని, చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలన్న నిర్ణయానికే కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ కట్టుబడి ఉన్నారని ప్రకటనలు చేస్తున్నారు. బసవరాజ్ మరణానికి ముందు జరిగిన చర్చల్లో ఆయుధాలను వదిలేయాలన్న ప్రతిపాదనకు ఆయన మొగ్గు చూపలేదని తేల్చి చెప్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా ఇదే అంశాన్ని తేల్చి చెప్తున్నారు.

నిజమేంటీ..?

మావోయిస్టు పార్టీ శ్రేణులంతా ఆయుధాల సహా జన జీవనంలోకి వచ్చేందుకు బసవరాజ్ మొగ్గు చూపారా లేక… అజ్ఞాత పోరాటానికే మొగ్గు చూపారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. పొలిట్ బ్యూరోలో కానీ, కేంద్ర కమిటీలో కానీ జరిగిన చర్చల సారాంశం ఏమిటన్న వాస్తవ విషయాలకు సంబంధించిన డాక్యూమెంట్ ఎవిడెన్స్ మాత్రం బయటకు రావడం లేదు. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి సమక్షంలో జరిగిన చర్చలకు సంబంధించిన విషయాల గురించి స్పెషల్ జోనల్ కమిటీలకు కానీ, రాష్ట్ర కమిటీలకు కానీ, ఇతరాత్ర ముఖ్య బాధ్యులకు కానీ తెలియజేశారా..? ఇందుకు సంబంధిత నాయకత్వం వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏమిటీ అన్నది మాత్రం తెలియరావడం లేదు. ప్రస్తుతం నెలకొన్న నిర్భందం దృష్ట్యా పార్టీ ముఖ్య నాయకత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అయినట్టయితే ఇందుకు సంబంధించిన ఆధారాల అయినా పార్టీ నేతల వద్ద ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రకటనల తీరును బట్టి మాత్రం మావోయిస్టు పార్టీ గందరగోళం నెలకొన్నట్టుగా స్పష్టం అవుతోంది.

ashannachhattisgarhdandkaranyamMALLOJJULA VENU GOPALmaoist