ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలపై చర్చ…
దిశ దశ, కరీంనగర్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఐపీఎస్ ఆఫీసర్ గౌష్ ఆలం లక్ష్యంగా ఆయన రెండోసారి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కరీంనగర్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్ పరిధిలో సీపీ ఆయన భార్య, స్నేహితులు కలిసి దాదాపు 180 రౌండ్ల మేర కాల్పులు జరిపారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2025 సెప్టెంబర్ 22న సీపీకి సంబంధించిన ఆరుగురు ప్రైవేటు వ్యక్తులు AK 47, SLR, షార్ట్ వెపన్స్ లను ఉపయోగించి కాల్పులు జరిపారన్నారు. మరో వైపున ఈ కాల్పులకు బోనాలపల్లికి చెందిన అమృతమ్మ అనే మహిళకు గాయం కాగా ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందించారని కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు.
సెలవులో సీపీ…
అయితే కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సెప్టెంబర్ నెలలో మూడు రోజుల పాటు సెలవులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని 2025 సెప్టెంబర్ 20వ తేదిన లీవుపై వెల్లి సెలవు ముగిసిన తరువాత కరీంనగర్ చేరుకున్నట్టుగా సమాచారం. సెలవుపై ఢిల్లీకి వెల్లిన సీపీ తన ఫ్యామిలీని కూడా వెంటబెట్టుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 22న సీపీ గౌష్ ఆలం భార్య స్నేహితులు ఫైరింగ్ రేంజ్ లో మూడు రకాల వెపన్స్ సాయంతో కాల్పులు జరిపారని ఎమ్మెల్యే ఆరోపిస్తుండడం గమనార్హం. పోలీసు అధికారుల అనుమతి తీసుకుని ఢిల్లీకి వెల్లిన సీపీ గౌష్ ఆలంతో పాటు ఆయన ఫ్యామిలీ ఫైరింగ్ రేంజ్ లో ఎలా ప్రత్యక్ష్యం అవుతారన్నదే అంతు చిక్కకుండా పోతోందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఒక వేళ సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడకు వచ్చినా ఈ విషయం ఇంతకాలం బయటకు పొక్కకుండా ఉండడం అసాధ్యమేనని పోలీసులు చెప్తున్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన పోలీసుల ద్వారా అయినా ఈ విషయం లీకయ్యే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపున వృద్దురాలికి గాయం అయిన తరువాత వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఆ సమయంలో అయినా ఈ విషయం వెలుగులోకి వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి.
నివేదికలు ఇలా…
అయితే సెప్టెంబర్ 22 2025న కరీంనగర్ సమీపంలోని ఎలగందల్ ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ జరిగింది వాస్తవమేనని పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న వారు అక్కడకు చేరుకుని ప్రాక్టీస్ చేసింది కూడా వాస్తవమేనని స్ఫష్టం అవుతోంది. అ సందర్భంగా అమృతమ్మ అనే మహిళకు గాయం అయిన విషయంపై సంబంధిత స్టేషన్ జనరల్ డైరీ (GD)లో కూడా నమోదు చేశారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC)లో శిక్షణ పొందుతున్న వారికి ఫైరింగ్ ప్రాక్జిస్ కోసం అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రిన్సిపల్ కోరగా ఈ మేరకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమృతమ్మకు గాయం అయిన తరువాత ఫైరింగ్ ప్రాక్టీస్ ను నిలిపివేసిన అధికారులు ఈ మేరకు నివేదికలు ఉన్నతాధికారులకు పంపించినట్టుగా సమాచారం. ఈ మేరకు ఎలగందల్ లోని ఫైరింగ్ రేంజ్ ను పోలీసు విభాగాలైన గ్రే హౌండ్స్ (Greyhounds), ఇంటలీ జెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW), కరీంనగర్ పోలీస్ ట్రైననింగ్ కాలేజీ (PTC), కరీంనగర్ కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారులు సందర్శించారు. ఫైరింగ్ రేంజ్ లో భారీ సైజులో రిటర్నింగ్ వాల్ నిర్మించినట్టయితే పరిసర ప్రాంతాల్లోని వారికి ప్రమాదాలు సంభవించే అవకాశం లేదని ఈ బృందం నివేదిక ఇచ్చాయి. దీంతో ఎలగందల్ ఫైరింగ్ రేంజ్ లో రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పోలీసు ఉన్నతాధికారులకు పంపించినట్టుగా తెలుస్తోంది.
ప్రత్యామ్నాయం…
అయితే కరీంనగర్ సమీపంలోని ఎలగందల్ ఫైరింగ్ రేంజ్ లో తాత్కాలికంగా ప్రాక్టీస్ ను నిలిపివేసిన పోలీసు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రాంను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ లో కొనసాగించినట్టుగా సమాచారం.