దిశ దశ, మంథని:
ఐదు దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతకు వారెంట్ జారీ అయింది. ఈ మేరకు పోలీసులు ఆయన ఇంటికి వారెంట్ నోటీసులు అతికించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రుర్లపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ మీసాల సత్తెన్నకు చత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లా NIA ప్రత్యేక కోర్టు, జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి వారెంట్ జారీ చేశారు. క్రైం నంబర్ 09/2025, సెక్షన్లు 191(2), 191(3), 190, 109 బి.ఎన్.ఎస్. సెక్షన్-25లలో కేసు నమోదు అయిందని, 27 మందిపై ఆయుధాల చట్టం మరియు VVIP చట్టంలోని సెక్షన్లు 13, 38(2), 39(2) కింద శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారన్న అభియోగంపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అందులో మల్ల రాజిరెడ్డి అలియాస్ శుభేష్ అలియాస్ సైనా విత్ మిషల్నా అలియాస్ అలోక్ అలియాస్ దేశ్ పాండే అలియాస్ SN అలియాస్ లక్ష్మణ్ పేరు కూడా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న కాంకేర్ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు కావాలని జులై 28న ప్రత్యేక న్యామూర్తి ఆదేశించారని ఆయన ఇంటికి పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. కాంకేర్ జిల్లా నుండి ప్రత్యేకంగా వచ్చిన పోలీసులు శాస్త్రుర్లపల్లికి చేరుకుని ఈ నోటీసులు ఆయన ఇంటికి అతికించారు.
2007లో అరెస్ట్
1970వ దశాబ్దం నుండే రైతు కూలి, విముక్తి పోరాటాల్లో పాల్గొన్న మీసాల రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న పీపుల్స్ వార్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సింగరేణిలో కార్మిక సమాఖ్యకు బలమైన పునాదులు నిర్మించిన ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యునిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2007లో కేరళ రాష్ట్రంలో అరెస్ట్ అయిన రాజిరెడ్డి దాదాపు రెండేళ్ల తరువాత బెయిలుపై వచ్చిన రాజిరెడ్డి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు అప్పటి నుండి కూడా దండకారణ్య అటవీ ప్రాంతానికే పరిమితం అయిన ఆయన ఉనికి మాత్రం వెలుగులోకి రాలేదు. కేంద్ర కమిటీ సభ్యునిగా, ఒరిస్సా స్టేట్ కమిటీ, స్టేట్ రీజనల్ బ్యూరోకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ప్రాంతంలో బెయిల్ పై చర్లపల్లి జైలు నుండి బయటకు వచ్చిన ఆయన జనజీవనంలో ఉంటారా లేక అజ్ఞాతంలోకి వెల్తారా అన్న విషయంపై చర్చ తీవ్రంగా సాగింది. కానీ ఆయన మాత్రం మావోయిస్టు పార్టీలో పనిచేసేందుకు తిరిగి అడవి బాట పట్టారు. తాజాగా చత్తీస్ గడ్ లోని కాంకేర్ NIA ప్రత్యేక కోర్టు, జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి వారెంట్ జారీ చేయడంతో అక్కడి పోలీసులు ఆయన స్వగ్రామానికి వచ్చి వారెంట్ నోటీసులు అంటించారు.