ఉద్యమ ఖిల్లాలో నయా కల్చర్…
దిశ దశ, చెన్నూరు:
నాలుగు దశాబ్దాల విప్లవోద్యమంలో సాయుధ పోరుబాట పట్టిన ఆ దంపతులు జన జీవనంలో కలిశారు. పోలీసుల ముందు సరెండర్ అయిన వారు స్వగ్రామానికి చేరగానే ఘన స్వాగతం పలికారు స్థానికులు. హరతులు ఇచ్చి కాళ్లు కడిగి తమతో కలిసి జీవించేందుకు వచ్చిన వారికి సాదర స్వాగతం పలికారు. పీపుల్స్ వార్ నుండి మావోయిస్టు పార్టీ వరకూ అడవులతోనే మమేకమైన వారికి గ్రామస్థులు పలికిన ఆహ్వానం తెలంగాణలో సరికొత్త సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది.
లచ్చన్న దంపతులు…
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లికి చెందిన ఆత్రం లచ్చన్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఆయన భార్య కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం అగ్రగూడకు చెందిన చౌదరి అంకుబాయి దండకారణ్యంలో జిల్లా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వీరు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందు లొంగిపోయాడు. అనంతరం పారుపెల్లికి చేరుకున్న లచ్చన్న, గంగుబాయి దంపతులకు గ్రామస్థులు లచ్యన్న కుటుంబ సభ్యులు కాళ్లు కడిగి, దండలు వేసి, హరతులు ఇచ్చి స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో లచ్చన్న దంపతులకు గ్రామస్థులు పలికిన స్వాగతం తీరు సరికొత్త సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది.
నేపథ్యం ఇది…
1983లో సిర్పూర్ ఏరియాలో పని చేస్తున్న గంగాధర అలియాస్ వేణు దాదా ద్వారా పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు లచ్చన్న. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న కూడా ఇదే సమయంలో పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. పార్టీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న నాయకులకు సమకాలికుడైన లచ్చన్న పార్టీ టెక్నికల్ కమిటీలో కీలక పాత్ర వహించాడని, డెన్ కీపర్ గా కూడా పని చేశాడు. నాటు తుపాకుల తయారీలో దిట్టగా పేరున్న ఆయన పార్టీకి ఆయుధాలు సమకూర్చుకోలేని పరిస్థితులు ఉన్న సమయంలో బర్మర్లు, 12 బోర్, తపంచాలను తయారు చేసి పార్టీకి సాయుధ బలాన్ని అందించాడు. విద్యను అందుకోలేకపోయిన లచ్చన్న పార్టీలో చేరిన తరువాత కూడా చదువుకునే ప్రయత్నం చేసినా అంతగా పలించకపోయినప్పటికీ ఆయన నాటు తుపాకుల తయారీలో మాత్రం సుశిక్షుతుడు కావడం గమనార్హం. మొదట చెన్నూరు దళంలో సభ్యునిగా పని చేసిన లచ్చన్న ఏరియా కమిటీ సభ్యునిగా, 1998లో సిర్పూర్ ఏరియా దళ డిప్యూటీ కమాండర్ గా పని చేశాడు. ఇదే సమయంలో చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్కను వివాహం చేసుకున్న ఆయన 1995 నుండి పార్టీ టెక్నికల్ టీమ్ లో పని చేస్తుండగా అర్బన్ ఏరియాకు పార్టీ నాయకత్వం పంపించింది. 2002లో జిల్లా కమిటీ సభ్యనిగా వ్యవహరించిన ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)లో పని చేశాడు. నార్త్ బస్తర్ డివిజన్ లో టెక్నికల్ టీమ్ ఇంఛార్జిగా వ్యవహరించిన లచ్చన్న 2023 నుండి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. తెలంగాణాలో ఆయనపై మొత్తం 35 కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు ప్రకటించారు. 1989లో అడవి బాట పట్టిన అంకుబాయి తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో పార్టీవైపు ఆకర్షితులు అయ్యారు. సిర్పూర్ దళ సభ్యురాలిగా పని చేసిన ఆమె లచ్చన్నను పెళ్లి చేసుకున్న తరువాత పార్టీ నాయకత్వం ఆయనతో పాటే అర్బన్ ఏరియాకు పంపించింది. 2002లో DKSZC టెక్నికల్ టీమ్ లో ఏరియా కమిటీ సభ్యురాలిగా పని చేసిన ఆమె ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.