ఒక్కొక్కరిది ఒక్కో గాథ… చిట్ సభ్యుల వ్యథ…

దిశ దశ, వరంగల్:

వరంగల్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన భవిత శ్రీ చిట్స్ సంస్థ యాజమాన్యం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ లో పలు చోట్ల కేసులు నమోదు కాగా తాజాగా మరికొంత మంది బాధితులు వెలుగులోకి వస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన బాధితులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మరో భవితశ్రీ చిట్స్ యాజమాన్యంతో పాటు ఏజెంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితుల కథనం ప్రకారం… 27 నెలలు గడిచిపోయిన ఓ చిట్ లో చేరి మరో 23 నెలల పాటు డబ్బులు చెల్లించాలని టీచర్ మూల రామకృష్ణ సూచించగా ఇందుకు సమ్మతించిన దేవునూరి జయప్రద దంపతులు చిట్ లో చేరారు. చిట్ 2020 అక్టోబర్ నెలలో చిట్ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా తమకు డబ్బులు తిరిగి చెల్లించలేదని బాధితులు వాపోయారు. అప్పటికే టీచర్ రామకృష్ణ ఈ డబ్బులకు తాను పూచికత్తుగా ఉంటానని నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ రాసి ఇచ్చాడు. అయితే అక్టోబర్ 2020లో కాలపరిమితి ముగిసిన తరువాత కూడా తమకు రావల్సిన రూ. 15 లక్షలు చెల్లించాలని రామకృష్ణను అడగగా రూ. 2 వడ్డీ చొప్పున చెల్లిస్తానని మాట ఇచ్చాడని వివరించారు. కొన్ని నెలల పాటు వడ్డీ డబ్బులు చెల్లించినప్పటికీ అసలు మాత్రం ఇవ్వలేదన్నారు.

ప్లాట్ ఎర…

దేవునూరి జయప్రద తన కూతురు వివాహం చేయాల్సి ఉందని తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని అడగగా రూ. 12 లక్షలు మాత్రమే వస్తాయని చెప్పి ఇందుకు గాను 200 గజాల ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేస్తామని మాట ఇచ్చారన్నారు. 20 రోజుల పాటు ఎదురు చూసినా తమకు మాత్రం భూమి రిజిస్ట్రేషన్ చేయలేదని టీచర్ రామకృష్ణను పదే పదే అడగగా మూడు నెలల తరువాత రూ. 2.50లక్షలు అకౌంటుకు బదిలీ చేశారన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి డబ్బులు ఎందుకు ఇచ్చారని రామకృష్ణను అడిగినప్పుడు ఆయన ఎధురు దాడికి దిగడం మొదలు పెట్టాడని బాధితులు వాపోయారు. మీరు చెల్లించిన డబ్బులు తనకు కాదని భవిత శ్రీ చిట్ సంస్థ యాజమన్యాన్ని అడగాలని తమను ఇష్టారీతిన తులనాడాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భవిత శ్రీ ఛైర్మన్ గుండా ప్రకాష్ రావు, సంస్థ ప్రతినిధి తాటిపల్లి శ్రీనివాస్, ఉద్యోగి సురేష్ లకు పలుమార్లు కాల్ చేసినా డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదన్నారు. వడ్డీ కాకుండానే తమకు ఇంకా రూ. 9.50 లక్షలు రావల్సి ఉందని, సంస్థకు ఏజెంట్ గా వ్యవహరించిన రామకృష్ణ, సంస్థ ప్రతినిధులు గుండా ప్రకాష్ రావు, తాటిపల్లి శ్రీనివాస్, సురేష్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు భవిత శ్రీ చిట్ ఫండ్ యాజమాన్యంతో పాటు ఏజెంట్ పై కేసు నమోదు చేశారు.

రిజిస్ట్రేషన్ విభాగం…

చిట్ ఫండ్స్ సంస్థలు సభ్యుల నుండి వసూలు చేసే డబ్బుల నుండి కమిషన్లు తీసుకుని నెల నెల చిట్ పాటలో ఎత్తుకున్న వారికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే చిట్ సభ్యులు డిఫాల్టర్ అయినప్పుడు సదరు వివరాలను సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వివరించి కొత్త సభ్యున్ని చేర్పించుకునేందుకు అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. అయితే దేవునూరి జయప్రదను చిట్ సభ్యురాలిగా చేర్పించుకున్నప్పడు చిట్స్, సొసైటీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతులు తీసుకున్నారా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. అంతేకాకుండా చిట్ ఫండ్ సంస్థలు కొత్తగా చిట్ ఏర్పాటు చేసినట్టయితే దాని విలువ ఎంత..? అందులో ఎంత మంది సభ్యులు ఉంటారు..? డివిడెండ్ తదితర సమగ్ర వివరాలను ముందుగా సంబందిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చిట్ విలువను బట్టి సంస్థ యాజమాన్యం వద్ద అంతే మొత్తంలో డిపాజిట్ తీసుకోవడమో లేక విలవుకు తగిని ఆస్థులను డిపాజిట్ చేసుకోడమో చేయాల్సి ఉంటుంది. అయితే భవిత శ్రీ చిట్ సంస్థ ఏర్పాటు చేసిన ఆయా బ్రాంచుల ద్వారా ఏర్పాటు చేసిన చిట్స్ విలువలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిపాజిట్లు చేశారా లేదా అన్న విషయంపై ఆరా తీయాల్సి ఉంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిపాజిట్ లేదా ఆస్థులను చూపించినట్టయితే వాటిని విక్రయించి బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిబంధనల మేరకు నడుచుకోకుండా అక్రమంగా చిట్ స్టార్ట్ చేసినట్టయితే నిబంధనలను అతిక్రమించారన్న కేసులు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చిట్ సంస్థ సభ్యులకు డబ్బులు చెల్లించకుండా ప్లాట్లు ఇస్తామని నమ్మబలకడం కూడా నిబంధనలకు విరుద్దమే అయినందున బాధ్యులైన వారిపై ఈ మేరకు చర్యలు తీసుకోవల్సి అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.

Chit fundscrimeLatest Newstelangana newswarangal