అభివృద్ది విషయంలో కలిసి రండి… అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి

ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకు తెలుసా..?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధ్వజం…

దిశ దశ, జగిత్యాల:

తాను కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో లేనని, నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకోలేకపోతున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు పార్టీని వీడే ఆలోచన రావడానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒక కారణం కాగా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ వారూ కూడా బాధ్యులేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఉడుములా చొచ్చుకుని వచ్చాడని సంజయ్ కుమార్ పై ధ్వజమెత్తిన జీవన్ రెడ్డి తనకీ పరిస్థితి ఎదురయ్యే కారణాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒకటన్నారు.

కండిషన్ అప్లై…

పార్టీ ఫిరాయించే విషయంలో తనతో పార్టీకి చెందిన కొంతమంది చర్చిస్తున్నారని వారితో మాట్లాడుతున్నానని అయితే ఇప్పటికీ తాను పార్టీ వీడేయోచనలో లేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు అభివృద్ది విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే స్వాగతిస్తానని, అయితే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారు తలదూర్చకూడదన్న షరతు విధించారు జీవన్ రెడ్డి. గతంలో తాను కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ది కోసం కలిసి పనిచేశాను తప్ప పార్టీ అంతర్గత వ్యవహారాల్లో భాగస్వామ్యం కాలేదని… ఇలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా నడుచుకోవల్సిన అవసరం ఉందన్నారు.

ఆయనదే పార్టీ..?

జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియకుండా పోయిందన్న జీవన్ రెడ్డి, తనతో కలిసి పని చేస్తానని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. తానింక బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వెల్లడించిన సంజయ్ కుమార్ తనతో కలిసి పని చేయడం ఏంటని..? తాను పార్టీ మారనని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని సంజయ్ వ్యాఖ్యానించడం వెనక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు.

పదవి ఆశించడం తప్పా..?

అయితే పదేళ్ల పాటు రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగానని, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేసిన తాను మంత్రి కావాలనుకోవడంలో తప్పులేదు కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, సీఎల్పీ నేతగా ఉన్న భట్టి డిప్యూటీ సీఎం అయ్యారని తాను మంత్రి పదవి ఆశించడం సరైందేనన్నారు. అయితే తాన భవిష్యత్ కార్యాచరణపై అనచరులతో చర్చిస్తున్నానని ప్రకటించిన జీవన్ రెడ్డి పరాభవ నామ సంవత్సరంలో నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

BRS NEWSCONGRESS PARTYJAGITIAL NEWST JEEVAN REDDYTELANGANA POLITCS
Comments (0)
Add Comment