జనజీవనంలోకి మరో ఇద్దరు కీలక నేతలు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య నాయకులు తెలంగాణ పోలీసుల వద్దకు చేరారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో తీవ్ర నిర్భందం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పార్టీని వీడుతున్న నాయకులతో పాటు వరస ఎన్ కౌంటర్లు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు ముఖ్య నేతలు జనజీనవంలోకి రావడం గమనార్హం. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్న తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ లు ఇద్దరు తెలంగాణ పోలీసుల వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు నర్సింహరెడ్డి అలియాస్ గంగన్నతో పాటు మరో 13 మంది జనజీవన స్రవంతిలో కలవనున్నారు.

ఆయన ప్రియ శిష్యుడు…

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్. కాలేజీ విద్యనభ్యసిస్తున్న సమయంలో విప్లవ భావజాలం వైపు అడుగులు వేశారు. పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన గణపతి ప్రియ శిష్యుల్లో ఒకరైన తిపిరి తిరుపతి కమ్యూనిజం భావజాలంతో పాటు సమకాలిన సమస్యలపై సుదీర్ఘ ఉపన్యాసం చేసేవారు. మొదట రాడికల్ విద్యార్థి సంఘం (RSU)లో పని చేసిన ఆయన పీపుల్స్ వార్ జిల్లా కమిటీ కార్యదర్శిగా గణపతి పని చేస్తున్నప్పుడు జిల్లా కమిటీ సభ్యుడు సాయిని ప్రభాకర్ తో కలిసి భావజాలాన్ని విస్తృతం చేసేవారు. వివిధ అంశాలపై ఆయన అనర్గలంగా ఇచ్చే ఉపన్యాసాలకు సీనియర్ నేతలైన మల్లోజ్జుల బ్రదర్స్ తో పాటు పలువురు సీనియర్లను ఆకట్టుకునేవారు. RSU జిల్లా అధ్యక్షులుగా మొదట పులి రాములు, మాసాని రవిందర్ లు పనిచేయగా వారి తరువాత ఆ బాధ్యతలు తిపిరి తిరుపతి చేపట్టారు. ఆయన RSU, రాడికల్ యూత్ లీగ్ (RYL) శ్రేణులకు రాజకీయ తరగతులు ఇచ్చే వారు. మొదట్లో చాలా ప్రాంతాల్లోని యువత తిరుపతి సార్ అని పిలిచేవారు. 1986-87 వరకు ఉమ్మడి జిల్లాలోనే RSU కార్యాకలాపాలు కొనసాగించిన ఆయనపై ఏబీవీపీ నాయకులు దాడి చేయడంతో గాయపడ్డారు. ఆ తరువాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం.

అప్పుడే…

తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ విప్లవోద్యమం అంతా కూడా ఇతర రాష్ట్రాల్లోనే కొనసాగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై అలిపిరి వద్ద మందుపాతర పేల్చినప్పుడు తిపిరి తిరుపతి పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ఆయన ఎక్కడున్నారోనన్న విషయంపై బాహ్య ప్రపంచానికి స్పష్టత లేకుండా పోయింది. కేంద్ర కమిటీ, పొలిటిబ్యూరో సభ్యత్వంతో పాటు రెండు దశాబ్దాల పాటు పార్టీ మిలటరీ కమిషన్ చీఫ్ గా పని చేశారు. పార్టీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ తరువాత ఆ బాధ్యతలను తిపిరి తిరుపతికి అప్పగించినట్టుగా ప్రచారం జరిగింది. పార్టీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ జనజీవనంలోకి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న మాత్రం కార్యదర్శిగా దేవ్ జీ కొనసాగుతున్నారని వెల్లడించారు. అయితే అంతకు ముందు మహారాష్ట్రలో జనజీవనంలోకి వచ్చిన మల్లోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను దాదా మాత్రం సీసీ కార్యదర్శి ఎన్నిక జరగలేదన్నారు.

తీవ్రంగా…

తెలంగాణ పోలీసులు దేవ్ జీతో పాటు రాష్ట్రానికి చెందిన కీలక నాయకులను జనజీవన స్రవంతిలోకి రప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ సరెండర్ ఆయనట్టయితే అన్న బాసటగా నిలుస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దండకారణ్య అటవీ ప్రాంతంలోని మావోయిస్టు పార్టీ తెలుగు నాయకులు తలెంగాణ పోలీసుల వద్దకు చేరుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది. హిడ్మా ఎన్ కౌంటర్ తరువాతే తిపిరి తిరుపతి కూడా లొంగిపోతారన్న ప్రచారం జరిగినప్పటికీ నేటి వరకు బయటకు మాత్రం రాలేదు. ఆయనతో చర్చలు జరిపి చివరకు ఒప్పించడంలో తెలంగాణ పోలీసులు సఫలం అయ్యారు.

సంగ్రామ్…

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని శాస్త్రుల్లపల్లికి చెందిన మల్ల రాజిరెడ్డి RSUలో పని చేస్తున్న క్రమంలో ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. సీపీఐ ఎంఎల్ పార్టీగా ఉన్నప్పుడే విప్లవ పంథావైపు అడుగులు వేశారు. మీసాల సత్తెన్న, సాయన్న, అలోక్, దేశ్ పాండే, సంగ్రామ్ వంటి పేర్లతో పార్టీలో ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన రాజీరెడ్డి సింగరేణి కార్మిక క్షేత్రమైన గోదావరిఖని టౌన్ సీఓగా పని చేశారు. సింగరేణి కార్మికుల్లో చైతన్యం నింపి సింగరేణి కార్మిక సమాఖ్యను బలోపేతం చేయడంలో రాజిరెడ్డిదే అత్యంత ముఖ్యమైన పాత్ర. మోటార్ సైకిల్ పై కోల్ బెల్ట్ ఏరియాలో తిరుగుతూ విప్లవ భావజాలాన్ని పెంపొందించేవారు. బయ్యపు దేవేందర్ రెడ్డి, కన్నాల రమణారెడ్డి తదితర నాయకులంతా కలిసి పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ కార్యాకాలాపాలు కొనసాగించే వారు. దక్షిణ, పశ్చిమ ప్రాంతీయ బ్యూరో (SWRB) ఇంఛార్జిగా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలతో ఏర్పడిన నైరుతి ప్రాంతీయ బ్యూరోకు కూడా ఇంఛార్జిగా పని చేశారు. 1975-77 ప్రాంతంలో అజ్ఞాతంలోకి వెళ్లిన రాజిరెడ్డి 2007లో కేరళలో అరెస్ట్ అయ్యారు దాదాపు రెండేళ్ల పాటు తెలంగాణలో జైలు జీవితం గడిపిన ఆయన బైయిలుపై విడుదలైన తరువాత కూడా మళ్లీ అడవి బాట పట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్ల రాజిరెడ్డి జనజీవనంలో కలవడంతో పెద్దపల్లి జిల్లాలోని మరో కీలక నేత బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టయింది. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులో మంథని పోలీసులు కుట్ర కేసు నమోదు చేయగా ఇందులో మల్ల రాజిరెడ్డి పేరు కూడా ఉంది. 2007లో అరెస్ట్ అయినప్పుడు ఈ కేసులో కూడా ఆయనను మంథని కోర్టులో హాజరు పరిచారు. అలాగే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన మరో కేసులో కూడా రాజిరెడ్డి ఉన్నారు. 1980వ దశాబ్దంలో రాజిరెడ్డి కోసం పోలీసుల వేదింపులు తీవ్రం కావడంతో ఆయన భార్య సుగుణ కూడా విప్లవ పోరాటంలో చేరారు.

ఉద్యోగం వద్దని… 

మల్ల రాజిరెడ్డితో పాటు ఆయన సోదరుడు భీంరెడ్డికి సింగరేణిలో ఉద్యోగం రాగా రాజిరెడ్డి తన అపాయింట్ మెంట్ లెటర్ చింపి వేసి ఎంఎల్ పార్టీలో చేరారు. ఆయన కూతురు స్నేహలత ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు సుగుణ కూడా పార్టీలో చేరడంతో ఆమె బాబాయ్ భీంరెడ్డి వద్ద ఉంటూ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రొఫెసర్ కాశీంల స్నేహలత వివాహం  అంబట్ పల్లి వద్ద జరిగింది. 

తనయుని హయాంలో…

మంథని ఎమ్మెల్యేగా మూడు సార్లు ప్రాతినిథ్యం వహించిన దుద్దిళ్ల శ్రీపాదరావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. 1994 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన శ్రీపాదరావు రక్షణ వలయం లేకుండానే గ్రామాల్లో తిరిగే వారు. ఈ క్రమంలో 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావును మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలోని జిల్లెల్ల వాగులో పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చి చంపారు. అప్పుడు కేంద్ర కమిటీతో పాటు పలువురు కీలక నేతలపై కుట్ర కేసు నమోదు చేశారు మంథని పోలీసులు. శ్రీపాదరావును కుట్ర పూరితంగా హత్య చేశారని ఇందులో కేంద్ర కమిటీ నాయకుల ప్రమేయం ఉందన్న అభియోగంపై కేసు నమోదు అయింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న మల్ల రాజిరెడ్డి జనజీవనంలో కలుస్తున్నారు. అయితే తండ్రి శ్రీపాదరావు హత్యకు కుట్ర కేసులో నిందితునిగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు వనాలను వీడి జనాల్లో వస్తుండడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పని చేస్తున్న శ్రీధర్ బాబు శ్రీపాదరావు తనయుడే. తండ్రిని చంపిన విప్లవ పార్టీ నేతలు తనయుడు మంత్రిగా ఉన్న ప్రభుత్వం ముందు జనజీవనంలో కలుస్తుండడం విశేషం. గత సంత్సరం చత్తీస్ గడ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకుని వచ్చి ఆయన ఇంటికి అతికించారు. 

DEVJILatest NewsMalla Rajireddy alias Sattennamaoist newsMAOIST PARTY
Comments (0)
Add Comment