Chhattisgarh: ఆదివాసీల శ్రమదానం… తాత్కాలిక వంతెన నిర్మాణం…

దండకారణ్యంలో దుర్భర జీవనం

దిశ దశ, దండకారణ్యం:

కీకారణ్యాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు రహదారుల వ్యవస్థ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. గ్రామాల మధ్య ఉన్న కాలువలు, నదులు దాటాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణ రోజుల్లోనే బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటేనే నీటిలో ఈదుకుంటూ వెల్తున్న ఇక్కడి ప్రజలు వర్షాకాలంలో అయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారో అర్థం చేసుకోవచ్చు. తమ గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పర్చాలని చేసిన అభ్యర్థనలను పట్టించుకునే వారు లేకపోవడంతో ఆదివాసీలే స్వచ్ఛందంగా శ్రమ దానం చేసుకున్నారు. వేసవి, చలి కాలల్లో అయినా ఇరుగు పొరుగు ప్రాంతాలకు క్షేమంగా వెళ్లి రావాలంటే కాలువలపై వంతెనలు నిర్మించుకోవల్సావలని భావించారు. ఇందు కోసం ఆదివాసీలంతా చేయి చేయి కలిపి తమకున్న పరిజ్ఞారనంతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. చత్తీస్ గడ్ లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో రోడ్లు, వారధులు నిర్మించుకున్న అడవి బిడ్డలు రవాణా సౌకర్యాలను బాగు చేసుకుంటున్నారు. తాజాగా దంతెవాడ జిల్లా గీదం బ్లక్ ప్రాంతంలోని కౌర్ గావ్ కు చెందిన ప్రజలు ఓ కాలువపై నిర్మించుకున్న వంతెనకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన దంతెవాడతో పాటు ఇతర ప్రాంతాలకు కమ్యూనికేషన్ లేకుండా పోయిన తాము కనీసం చలి, వేసవి కాలల్లో అయినా బాహ్య ప్రపంచంలోకి వెళ్లి రావాలని భావించారు. నిత్యవసర సరుకులతో పాటు వైద్య, విద్య తదితర సౌకర్యాలను కూడా అందుకోలేకుండా పోతున్నందున శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం వెదురు, స్తంబాల సహాయంతో కంకర రాళ్లను వేసి తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. దీంతో ఇతర గ్రామాలకు మధ్య రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ వంతెనతో తమ గ్రామానికి కావల్సిన అవసరాలను తీర్చుకునే అవకాశం లభించిందని కౌర్ గావ్ వాసులు అంటున్నారు.

ప్రభుత్వం…

అయితే రవాణా సౌకర్యాలు మెరుగు పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు మార్లు వినతి చేసినా పాలకులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ బాగు పర్చడంలో విఫలం అయ్యారని ఇక తామే శ్రమదానంతో వారధి నిర్మించుకోవల్సి వచ్చిందని అంటున్నారు. అనారోగ్యం బారిన పడినప్పుడు కానీ, విద్య కోసం కానీ, ఇతరాత్ర అవసరాలకు కానీ తాము బయటకు వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యేదని, తాము కట్టిన తాత్కాలిక వారధితో ఈ సమస్యకు చెక్ పెట్టుకోగలిగామని చెప్తున్నారు. అయితే తాము ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

జనతన్ సర్కార్…

బస్తర్ పూర్వ జిల్లా… అభూజామడ్ అటవీ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ క్రాంతి కారీ జనతన్ సర్కార్ పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక్కడి ఆదివాసీలకు వ్యవసాయ, విద్య, వైద్యంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగు పర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుందని ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆదివాసీ పల్లెలకు అవసరమైనంత మేర రవాణా సౌకర్యాలు అందలేదని స్పష్టం అవుతోంది. కౌర్ గావ్ ప్రజలు సొంతగా తాత్కాలిక వంతెన నిర్మించుకోవల్సి వచ్చిందంటే ప్రాంతంలో అభివృద్ది ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బస్తర్ ఉమ్మడి జిల్లాతో పాటు మాడ్ తదితర ప్రాంతాల్లోని అడవి బిడ్డలు కష్టాలతోనే సహవాసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కీకారణ్యాలతో మమేకమై జీవనం సాగిస్తున్న ఇక్కడి గిరిజన బిడ్డల కోసం సౌకర్యాలను కల్పించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది.

bastarChattisgarhDANDKARNYAMDKSZCmaoist