ప్రాథమిక విద్యతో సరిపెట్టి… విప్లవ బాట పట్టి…

ఆరు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ హిడ్మా నేపథ్యం ఇది…

దిశ దశ, దండకారణ్యం:

కీకారణ్యాల నడుమ ఉన్న ఓ చిన్న గ్రామంలో పూరి గుడిసెలో నివసిస్తున్న ఆదివాసి కుటుంబానికి చెందిన ఆయన ఆరు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యాడు. ప్రాథమిక విద్యతోనే సరిపెట్టినా విప్లవోద్యమంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. చిన్న వయసులోకే కేంద్ర కమిటీలో స్థానం దక్కించుకున్న ఆయన ఎవరంటే..?

బాలల సంఘం…

చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా పువర్తికి చెందిన మడావి హిడ్మా 1991లో బదర్నా ద్వారా బాలల సంఘలో సభ్యుడిగా చేరారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్న హిడ్మా విప్లవోద్యమంలో కొనసాగుతూనే ఆయా రంగాలపై పట్టు బిగించారు. 2002లో బాలాఘాట్ ఏరియాలో పనిచేసిన ఆయన 2004లో కుంట ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేశారు. మూడేళ్లలోనే అంటే 2007లో కంపెనీ నంబర్ 3 కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన మడావి హిడ్మా 2009లో PLGA బెటాలయిన్ డిప్యూటీ కమాండర్ గా, 2021 వరకు మిలటరీ బెటాలియన్ ఇంఛార్జిగా పని చేశాడు. 2011లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పీఎల్జీఏ బెటాలియన్ ఇంఛార్జిగా కూడా పని చేశారు. 2023, 24లో కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన హిడ్మా పార్టీలో పరిచయం అయిన గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ కు చెందిన రాజే అలియాస్ రాజక్కను వివాహం చేసుకున్నాడు. రాజే మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇంఛార్జిగా డీవీసీఎం హోదాలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే హిడ్మా ఆరు భాషల్లో మాట్లాడేవాడని తెలుస్తోంది. కోయా, గోండి, హల్బీ, దోర్లా, హిందీ, ఛత్తీస్‌గఢి, తెలుగు భాషల్లో పార్టీ శ్రేణులతో చర్చలు జరిపేవాడని సమాచారం.

దాడులు…

దండకారణ్య అటవీ ప్రాంతంపై తిరుగులేని పట్టు ఉన్న హిడ్మా ఎదుగుతున్నా కొద్ది మావోయిస్టు పార్టీకి బలమైన శక్తిగా మారిపోయాడు. బస్తర్ అటవీ ప్రాంతంలో హిడ్మా స్కెచ్ వేశాడంటే చాలు బలగాలపై పై చేయి సాధిస్తామన్న ధీమా పార్టీ నాయకత్వానికి ఉండేది. చత్తీస్ గడ్ రాష్ట్రంలో చేపట్టిన మేజర్ ఆపరేషన్లన్ని కూడా హిడ్మా నేతృత్వంలోనే సాగాయంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఆయన అంటే ఎంతటి భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రత్యక్ష్యంగా పాల్గొన్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి… 2005లో ఇంజరామ్ వద్ద మందుపాతర పేల్చిన ఘటనలో ఐదుగురు బలగాలు చనిపోగా, 2005లో దర్బాగూడ (ఎర్రబోర్) వద్ద సల్వాజూడుం కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చడంతో 28 మంది చనిపోగా మరో 28 మంది గాయపడ్డారు. ఇదే సంవత్సరం కొత్తచెరు వద్ద మందుపాతర పేల్చిన ఘటనలో 9 మంది జవాన్లు మరణించగా, 2007లో ఉర్పాల్ మెట్టా దాడిలో 23 మంది జవాన్లను హతమర్చాడు. 2007లో ఎర్రబోర్ శిబిరంపై దాడి చేసిన ఘటనలో 33 మంది మరణించారు. ఇదే ఏడాది మోటగూడ ఎర్రబోర్ వద్ద మందుపాతర పేల్చిన ఘటనలో 8 మంది జవాన్లు, తాడ్మెట్ట వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది జవాన్లు సిబ్బంది చనిపోయారు. తర్లగూడ, గొల్లపలి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది జవాన్లు చనిపోగా, 2009లో చింతాగుఫా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది జవాన్లు చనిపోగా ఏడుగురు గాయాలపాలయ్యారు. 2009లో అసిర్ గూడ ఇంజిరామ్ వద్ద రోడ్ ఓపెనింగ్ పార్టీలపై దాడి, రేషన్ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను మందుపాతరలతో పేల్చడంతో ఏడుగురు జవాన్లు. నలుగురు స్థానికులు మృత్యువాత పడ్డారు. 2010లో తడ్మెట్ట చింతగుఫా వద్ద మైన్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ప్రాణాలతో బయటపడ్డ జవాన్లు వాహనం నుండి బయటకు వస్తుండగా అంబూష్ తీసుకుని ఉన్న నక్సల్స్ కాల్పులు జరపడంతో 76 మంది జవాన్లు చనిపోయారు. ఒకే ఘటనలో భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను కోల్పోయిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు పోలీసు అధికారులపై అప్పటి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుందంటే ఈ ఘటనను ఎంత సీరియస్ గా పరిగణించిందో అర్థం చేసుకోవచ్చు. 2014లో బుర్కపాల్, చింతగుఫా వద్ద జరిపిన దాడిలో 25 మంది జవాన్లు మరణించగా, 2017లో బంకుపరా, బేజ్జీ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. 2020లో మిన్నా, చింతుగుఫా దాడిలో 17 మంది జవాన్లు, 2021లో టేకులగూడెం ఎన్ కౌంటర్ ల్ 22 మంది జవాన్తు చనిపోయారు. 2024లో ధర్మవరం క్యాంపుపై దాడికి పాల్పడ్డాడు. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడి తన జీనగూడ అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపిన ఘటన కూడా సంచలనంగా మారింది. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన బలగాలతో ఎదురు కాల్పులు జరుపుతున్న వీడియోలను రికార్డు చేయించి మీడియాకు విడుదల చేయడం వంటి ఘటనల్లో కూడా హిడ్మా పాత్ర ఉంది.

అడవితోనే…

దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే హిడ్మా తాను పుట్టి పెరిగిన అడవులను వదిలి ఏనాడు బాహ్య ప్రపంచంలోకి రాలేదని ప్రచారంలో ఉంది. ఒకటి రెండు సార్లు బయటకు వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు చెందిన వారితో సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే  కొనసాగించేవాడని తెలుస్తోంది. జర్నలిస్టులు, పార్టీ శ్రేణులు వంటి వారితో పరిమితమైన సంబంధాలు కొనసాగించిన హిడ్మా కీకారణ్యాల్లో రేడియో వినడం, పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడని తెలుస్తోంది. తాను బాధ్యతలు నిర్వర్తించే బెటాలియన్ ఆర్థిక పర్యవేక్షణతో పాటు ఏడాదికి రెండు సార్లు బెటాలియన్ పార్టీ కమిటీ (BNPC) సమావేశాలు నిర్వహించేవాడు. అన్నింటింకటే ముఖ్యంగా పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ వ్యక్తిగత నేపథ్యం గురించి సమగ్ర అవగాహనతో ఉండేవాడని సమాచారం. ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాల ప్రతిపాదనలను తరుచూ తిరస్కరించేవాడని తెలుస్తోంది. ఆపరేషన్లకు ముందు రెక్కీ నిర్వహించడంతో పాటు అమలు చేసే విషయంలో సునిశితంగా పరిశీలన చేసి లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన కార్యచరతో ముందుకు సాగేవాడు. ఆపరేషన్లు అమలు చేసేప్పుడు ముందు వరసలో ఉండకుండా బలగాలను ఎలా డ్యామేజీ చేయాలన్న విషయంలో అప్పటికప్పుడు పీఎల్జీఏ సభ్యులకు గైడ్ చేస్తుండేవాడని సమాచారం.

ఆరు రాష్ట్రాల్లో…

ఇకపోతే మడావి హిడ్మా తలపై ఒక్క చత్తీస్ గడ్ లోనే కాకుండా ప్రభావిత రాష్ట్రాలన్నింటా కూడా వెలకట్టినట్టు తెలుస్తోంది. చత్తీస్ గడ్ ప్రభుత్వం ఇతనిపై రూ. 40 లక్షలు, మహారాష్ట్ర రూ. 50 లక్షలు, ఒడిశా 25 లక్షలు, తెలంగాణ రూ. 25 లక్షలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు రూ. 15 లక్షల రివార్డు ప్రకటించాయి. మంగళవారం ఏపీలోని మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోవడం పార్టీ తీరని నష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ChattisgarhDANDKARNYAMhidmamaoist hidmamaoist news