ఆయుధ విరమణే… లొంగుబాటు కాదు…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ దండకారణ్య జోన్ లో లొంగుబాటు పరంపరపై జనజీవనంలోకి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు వెల్లడించిన విషయాలు సరికొత్త చర్చకు తెరతీశాయి. తాము లొంగిపోవడం లేదని, ఆయుధాలను వదిలేసి ఉద్యమానికి విరామం మాత్రమే ప్రకటించామని చత్తీస్ గడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అయితే ఆయుధ పోరాటాన్ని వదిలేసే ముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న విజయ్ శర్మతో జరిగిన చర్చలను కూడా రూపేష్ వివరించారు.
డిమాండ్లు ఇవే…
మూలవాసి బచావో మంచ్ పై చత్తీస్ గడ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ పై నిషేధం విధించకూడదన్న విషయంపై డిప్యూటీ సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. అలాగే తనతో పాటు బాహ్య ప్రపంచలోకి వస్తున్న వారందరిని డిస్ట్రిక్ట్ రిజర్వూ గార్డ్ (DRG)లో కానీ మావోయిస్టుల ఏరివేతకోసం ఏర్పాటు చేసిన ఏ విభాగంలో కానీ, నక్సల్స్ ఆపరేషన్లలో తమను భాగస్వాములను చేయరాదన్న డిమాండ్ కు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రూపేష్ వెల్లడించారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని జైలు జీవితం గడుపుతున్న వారందరిని విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, వారిపై ఉన్న కేసులను కూడా ఎత్తి వేయాలన్న ప్రతిపాదనకు కూడా సుముఖత వ్యక్తం చేసిందన్నారు. అయితే తాము ఆయుధ విరమణ చేసిన తరువాత జైళ్లలో ఉన్న మావోయిస్టు పార్టీ శ్రేణులను కలిసి వారితో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేసుల మినహాయింపు ప్రక్రియకు సంబంధించిన విషయాలపై దృష్టి సారిస్తామని తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ వెల్లడించారు. తామిప్పుడు బయటకు వస్తున్నది ఆత్మసమర్ఫణ కోసం మాత్రం కాదని ఆయుధ విరమణ మాత్రమేనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ కగార్…
ఆపరేషన్ కగార్ తరువాత దండకారణ్యంలో ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఎదుర్కొవల్సి వస్తోందన్న విషయాన్ని గమనించే నార్త్ బస్తర్, మాఢ్ డివిజన్ కమిటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రూపేష్ తో పాటు ఇతరాత్ర మావోయిస్టు పార్టీ బాధ్యులు ప్రకటించిన తీరును బట్టి స్పష్టం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నిర్భందం వల్ల సాయుధ పోరాటం చేసే పరిస్థితులు లేకుండా పోయాయన్న ఆందోళన వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థం అవుతోంది. అయితే వీరంతా బాహ్య ప్రపంచలోకి వచ్చిన తరువాత చత్తీస్ గడ్ ప్రభుత్వం వీరి డిమాండ్లను నెరవేర్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుందోనన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రభావం విప్లవోద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టు పార్టీ ఇతర నేతలు, శ్రేణులపై ఖచ్చితంగా పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి రూపేష్ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చిన తరువాతే బాహ్య ప్రపంచంలోకి వచ్చారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్, కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై వ్యవహరించే తీరు ఎలా ఉండబోతుందన్నదే అటు మావోయిస్టు పార్టీలో ఇటు ప్రజల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
158 మంది…
నార్త్ బస్తర్, మాఢ్ డివిజన్ కమిటీలకు చెందిన 158 మంది వరకు సాయుధ నక్సల్స్ ఆయధాలను అప్పగించే కార్యక్రమం కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్మాన్, రణితలు కూడా ఉన్నారు శుక్రవారం చత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు లొంగిపోయే వారిలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, మాఢ్ వివజిన్ కమిటీ కార్యదర్శి ఒకరుు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఇద్దరు, డీవీసీఎంలు 15మంది, ఏసీఎంలు, జన మిలీషియా ప్రతినిధులు 135 వరకూ ఉన్నట్టుగా తెలుస్తోంది. 78 ఆధునిక ఆయుధాలతో పాటు మొత్తం 114 వరకు వెపన్స్ ను వీరు ప్రభుత్వానికి అందించనున్నట్టుగా సమాచారం.