ఎస్సారెస్పీ కెనాలే రోడ్డే ఆ వెంచర్ రహదారి…

అభ్యంతరం చెప్పిన అధికారులు…

విక్రయానికి ప్లాట్లు… అక్షర టౌన్ షిప్ తీరు…

దిశ దశ, కరీంనగర్:

డిస్ట్రిబ్యుటరీ కెనాల్ రహదారినే వెంచర్ ప్రధాన రహదారిగా చూపించి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిన ఆ సంస్థ చర్యలకు అడ్డుకట్ట వేసినా ఫలితం లేకుండా పోయిందా..? చాలాకాలమయింది కదా అసలు విషయం మరుగునపడి పోయిందన్న ధీమా వచ్చిందా..? లేక అమాయకులు ప్లాట్లు కొనేందుకు ఎగబడతారన్న ధీమానో తెలియదు కానీ… మళ్లీ ఆ వెంచర్ లో ప్లాట్లు విక్రయించేందుకు బాజాప్తాగా ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూ ప్లాట్లు విక్రయించేందుకు కార్యరంగంలోకి దూకారు.

నగునూరు…

కరీంనగర్ సమీపంలోని నగునూరు దుర్గా మాత ఆలయం సమీపంలో గతంలో స్టార్ట్ చేశారు. అక్షర టౌన్ షిప్ పేరిట ప్రారంభించిన ఈ వెంచర్ లో ప్లాట్లు విక్రయించేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (SUDA) నుండి అనుమతులు తీసుకున్నారు. ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డును ఈ వెంచర్ కు ప్రధాన రహదారిగా చూపించారు. అంతకు ముందు స్థానిక రైతుల పేరిట రోడ్డును బాగు చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అనుమతి ఇవ్వడంతో రైతుల ముసుగులో కెనాల్ రోడ్డును బాగు చేసుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటరీ కెనాల్ రోడ్డుపై తారు కూడా వేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఆరోపణలు రావడంతో ఎస్సారెస్పీ అధికారులు రంగంలోకి దిగి బీటిని తొలగించడంతో పాటు కెనాల్ రోడ్డును వెంచర్ మెయిన్ రోడ్డుగా వినియోగించుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. మరో వైపున ఈ భూమిని చదును చేసుకుంటున్న క్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఛానెల్స్ కూడా దెబ్బతిన్నాయి. ఛానెల్స్ డ్యామేజ్ కావడంతో దిగువ ప్రాంతంలోని భూములకు సాగు నీరు రావడం లేదని రైతులు అధికారులను అశ్రయించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పుడు ఎందుకనో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు మాత్రం కాలేదు. అటు ఎస్సారెస్పీ అధికారులు, ఇటు పోలీసులు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు మాత్రం సాహసించలేదు. మరో వైపున SUDAకు లేఖ రాసిన SRSP అధికారులు అక్షర టౌన్ షిప్ యాజమాన్యం ఎస్సారెస్పీ కెనాల్ రహదారిని మెయిన్ రోడ్డుగా చూపించిందని, నిబంధనలకు విరుద్దంగా దరఖాస్తు చేసుకుని సుడా అనుమతులు తీసుకున్నారని వివరించారు. అంతేకాకుండా ఈ వెంచర్ కు సుడా ఇచ్చిన అనుమతులు రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో సదరు వెంచన్ యాజమాన్యం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా తమ శాఖ ద్వారా నో ఆబ్జక్షన్ తీసుకున్న తరువాతే ఇవ్వాలని కూడా కోరారు. దీంతో అప్పటి నుండి నగునూరు అక్షర టౌన్ షిప్ వెంచర్ వ్యవహారం మరుగునపడిపోయింది.

మళ్లీ తెరపైకి…

అయితే నగునూరులోని అక్షర వెంచర్ విషయంలో ఇరిగేషన్ విభాగం నుండి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని డిప్యూటీ ఈఈ సంతోష్ తెలిపారు. తాము గతంలోనే సుడా కార్యాలయానికి లేఖ కూడా రాయడం జరిగిందని వెల్లడించారు. తాజాగా ఈ వెంచర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు ఇతరాత్ర పనులు చేపట్టిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయని చెప్తున్నారు. గజానికి రూ. 10 వేల చొప్పున విక్రయిస్తామని, కార్నర్ బిట్లలోని ప్లాట్లు అయితే అదనపు ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కాంటాక్ట్ నంబర్ ఇవ్వడంతో పాటు, అక్షర వెంచర్ లో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారుల అనుమతులు లేకుండానే ఇక్కడ ప్లాట్లు విక్రయించేందుకు బాజాప్తాగా ప్రచారం చేస్తుండడం విస్మయం కల్గిస్తోంది.

Akshara Townshipkarimnagar newsReal EstateREAL MAFIASRSP CANAL ROAD